గులాబీ దళాల మీదికి వరుణాస్త్రం

Update: 2016-09-02 05:00 GMT
కేసీఆర్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఏ ఎన్నికలు వచ్చినా అప్రతిహతంగా గెలుస్తూనే పోతోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలను కూడా ఫుల్‌ స్వీప్‌ చేసి విపరీతమైన మెజారిటీతో గెల్చిన సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా వరుణుడి దెబ్బ - విడువకుండా కురుస్తున్న వర్షాలు జనజీవితాన్ని అతలాకుతలం చేసేస్తున్న పరిస్థితి కలిసి గులాబీ సర్కారు మీద సదభిప్రాయాన్ని పోగొట్టే పరిస్థితి ఏర్పడుతోంది. ఈ వర్సాలకు హైదరాబాదులో జీవితం దారుణంగా మారిపోతున్న సంగతి ప్రజలకు తెలుస్తూనే ఉంది.

ఈ పరిస్థితిని ప్రతిపక్షాలు బాగానే వాడుకుంటున్నాయి. ఇందులో ప్రభుత్వ వైఫల్యం ఉన్నదంటూ బాగా ప్రచారం చేస్తున్నాయి. తెరాస ప్రభుత్వం మీద ఏ రూపంలో ఏ కారణాలను చూపించి విరుచుకు పడాలో ప్రతిపక్షాలకు బోధ పడడం లేదో ఏమో గానీ.. హైదరాబాదు నగరంలో జీవనాన్ని అతలాకుతలం చేస్తున్న వర్షాలు వారి చేతికి మంచి అస్త్రాలను అందిస్తున్నాయి.

వర్షం కురిసినప్పుడు సమీక్ష నిర్వహించడం నగరాన్ని బాగు చేసేస్తున్నాం అని చెప్పడం తప్ప గత రెండేళ్లలో ప్రత్యేకించి నగరంలో మురుగునీటి పారుదల వ్యవస్థ విషయంలో తెరాస ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నదో చెప్పాలని ప్రతిపక్షాలు ఇప్పుడు నిలదీస్తున్నాయి.

మొత్తం ఈ వారుణాస్త్రం దెబ్బకు బాగా కురుస్తున్న వర్షాలకు జనంలో కూడా సర్కారు వైఫల్యం మీద ఓ అభిప్రాయం కలుగుతుందని, ప్రభుత్వం పరువు పోతుందని పలువురు అంచనా వేస్తున్నారు. మొత్తానికి వాన దెబ్బ గులాబీ దళానికి బాగానే తగిలేలా ఉంది. వర్షం కష్టాలనుంచి ప్రజలను గట్టెక్కించడానికి ప్రభుత్వం తక్షణం ఏమైనా చేయాల్సి ఉంటుందని జనం కోరుకుంటున్నారు.
Tags:    

Similar News