బాబుతోనే బ్లాక్ బస్టర్ హిట్... ?

Update: 2021-11-16 09:30 GMT
తెలుగుదేశం పార్టీలో ఎపుడూ ఏక నాయకత్వమే ఉంటూ వస్తోంది. తెలుగు సూపర్ స్టార్ ఎన్టీయార్ ప్రారంభించిన ఈ రాజకీయ పార్టీ ఆయన సినిమాల మాదిరిగానే బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక ఎన్టీయార్ ఒకే ఒక్కడుగా టీడీపీని తాను ఉన్నంతకాలం శాసించారు. ఆయన వద్ద నుంచి పార్టీని తన చేతుల్లోకి తీసుకున్న చంద్రబాబు తన సహ‌చరులను సైతం సైడ్ చేసి వారికే సూపర్ బాస్ అయిపోయారు.

చంద్రబాబు వన్ టూ టెన్ గానే పార్టీలో ప్రభుత్వంలో చక్రం తిప్పారు. అయితే 2009 నాటికి లోకేష్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత 2014లో విభజన ఏపీలో అధికారంలోకి రావడంతో బాబుతో పాటు లోకేష్ కూడా ముందుకు వచ్చేశాడు. మూడేళ్ల పాటు మంత్రిగా పనిచేసిన లోకేష్ భావి సీఎం అని పిలిపించుకునే రేంజిలో నాడు తెగ హడావుడి చేశాడు.

ఇక 2019లో టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తే జరిగేది లోకేష్ పట్టాభిషేకమే అని నాడు అనుకున్నారు. కానీ కధ అక్కడే అడ్డం తిరిగింది. ఇపుడు చూస్తే పార్టీ విపక్షంలో ఉంది. పెదబాబు చినబాబు ఇద్దరూ కలసినా పార్టీని లేపలేకపోతున్నారు.

ఇక లోకేష్ తో పోలిస్తే చంద్రబాబే మాకు ఎప్పటికీ బాస్ గా ఉండాలన్నదే మెజారిటీ తమ్ముళ్లలో కనిపిస్తోంది. బాబుకు ఏ రోజుకైనా లోకేష్ వారసుడే కానీ ఇపుడు కాదు అంటున్నారు. అంటే చినబాబు వల్ల ఏమీ కాదని తేలిపోతోంది. అందుకే వయసు మీద పడినా కూడా చంద్రబాబే జగన్ ని ఢీ కొట్టి టీడీపీకి అధికారం తీసుకురాగలరని వారు భావిస్తున్నారు.

మరో వైపు చూస్తే టీడీపీకి గట్టి మద్దతుగా నిలిచిన ఒక సెక్షన్ మీడియా సైతం చంద్రబాబునే హైలెట్ చేయడం మొదలెట్టింది. బాబుని ముందు పెడితేనే టీడీపీ కధ సాఫీగా సాగుతుంది అన్నది ఆ వర్గం మీడియా మోతుబతులు నేర్చిన నయా రాజకీయ సూత్రం అంటున్నారు. అందుకే లోకేష్ కంటే కూడా టీడీపీలో చంద్రబాబుకే మీడియాలో ప్రయారిటీ ఇవ్వాలని డిసైడ్ అయినట్లుగా భోగట్టా. ఇక చంద్రబాబు మీద ఈ రోజుకీ జనాల్లో ఎంతో కొంత నమ్మకం అయితే ఉంది. దాన్ని పాజిటివ్ గా మార్చుకుంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం కష్టం కాబోదు అనే అంటున్నారు.

మంచి పాలనాదక్షునిగా చంద్రబాబుకు పేరుంది. ఏపీలో అప్పుల కధ బాబు నుంచే మొదలైనా కూడా ఏనాడూ ఉద్యోగుల జీతాలకు ఇబ్బందులు ఎదురుకాలేదు. దాంతో పాటు ఎంతో కొంత అభివృద్ధి అన్నది నాడు కనిపించింది అన్న మాట కూడా ఉంది. ఇవే రేపటి ఎన్నికల్లో టీడీపీకి విజయాస్త్రాలుగా మారబోతున్నాయి అంటున్నారు. ఇక చంద్రబాబు ఏజ్ ని కూడా ప్లస్ గా చూపించడానికి కూడా అనుకూల మీడియా కంకణం కట్టుకుందిట.

బాబు కంటే వయసులో పెద్ద వారు అయిన ఎంతో మంది దేశానికి ఈ రోజుకీ సేవలు చేస్తున్నారని, దాదాపుగా బాబుకు అటూ ఇటూ ఏజ్ లో ఉన్న తమిళనాడు సీఎం స్టాలిన్ అక్కడ దూకుడుగా పాలన సాగించగా లేనిది ఏ అనారోగ్య సమస్యలూ లేని బాబుకు ఎందుకు చాన్స్ రాదు అన్నదే ఆయన వర్గం వాదనగా ఉంది. దాంతో యువకుడు అయిన జగన్ తో పోలిస్తే అనుభవం కలిగిన బాబుకే ఏపీ జనం ఓటేస్తారని, ఓటేయాలని కూడా టీడీపీ వాదనగా కనిపిస్తోంది.

మొత్తానికి లోకేష్ ఇపుడు కాదు, తరువాత అన్నది దాదాపుగా టీడీపీ అనుకూల శక్తులకు అర్ధమైపోయింది. బాబుని ముందు పెడితేనే టీడీపీ బొమ్మ 2024 ఎన్నికల్లో బ్లాక్ బస్టర్ అవుతుంది అన్నదే వారి వ్యూహం. మరి దీన్ని జగన్ ఎలా తిప్పికొడతారో చూడాలి.



Tags:    

Similar News