టీజీ గోల.. మరీ ఎక్కువైపోయిందబ్బా!

Update: 2019-09-09 01:30 GMT
టీజీ వెంకటేశ్... ప్రముఖ పారిశ్రామిక వేత్త గానే కాకుండా ఇటీవలి కాలంలో వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్న రాజకీయ నేతగానూ అందరికీ చిరపరచితులే. తొలుత పారిశ్రామికవేత్తగానే ఉన్న టీజీ వెంకటేశ్.. ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఎమ్మెల్యేగా - మంత్రిగా - ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న టీజీ... గడచిన వారం పది రోజుల నుంచి రోజూ ఏదో ఒక విషయంపై మీడియాతో మాట్లాడుతూనే ఉన్నారు. నవ్యాంధ్ర నూతన రాజధానిని అమరావతి నుంచి తరలిస్తారన్న ప్రచారంపై స్పందించేందుకు మీడియా ముందుకు వచ్చిన ఆయన ఆ తర్వాత అదే విషయంపై రోజూ మీడియా ముందుకు వస్తూనే ఉన్నారు. వచ్చిన ప్రతి సారీ ఏదో ఒక సంచలన వ్యాఖ్య చేస్తూ అందరి దృష్టిని తన వైపు తిప్పేసుకుంటున్నారు. మొత్తంగా టీజీ గోల ఈ మధ్య మరీ ఎక్కువైపోయిందన్న వాదన వినిపిస్తోంది.

తొలుత టీడీపీలో చేరిన టీజీ వెంకటేశ్... 1999లో కర్నూలు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2004లో ఓటమిపాలై.. కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. 2009లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగానే విజయం సాధించిన టీజీ... నల్లారి కేబినెట్ లో మంత్రిగానూ పనిచేశారు. ఆ తర్వాత మరోమారు టీడీపీలోకి వచ్చిన ఆయన టీడీపీ సభ్యుడిగానే రాజ్యసభలో ఎంట్రీ ఇచ్చారు. తాజాగా 2019 ఎన్నికల తర్వాత టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఆయన ప్రస్తుతం కమలనాథులు గా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో రాజధానిని అమరావతి నుంచి తరలిస్తారని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చిన టీజీ... సీఎం జగన్ ఏకంగా నాలుగు రాజధానులు కడతారని సంచలన ప్రకటన చేశారు.

ఆ తర్వాత వరుసగా రాజధాని - రాయలసీమ - కర్నూలు జిల్లాకు సంబంధించిన ప్రాధాన్యాతలపై మాట్లాడుతూ... ఆదివారం అమరావతిని ఫ్రీజోన్ చేయాలంటూ సరికొత్త వాదనను వినిపించారు. అమరావతిని ఫ్రీజోన్ చేయాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. ఉమ్మడి మద్రాసు - ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఫ్రీజోన్ లేని కారణంగా రాయలసీమ ప్రాంతం చాలా నష్టపోయిందని - ఇప్పుడు కూడా అదే తప్పు జరిగితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. వేల కోట్ల రూపాయలతో అమరావతిలో నిర్మించిన హైకోర్టు - అసెంబ్లీ - సెక్రటేరియట్ చాలు అని - అక్కడ కొత్తగా ఒక్క నిర్మాణం చేపట్టినా వ్యతిరేకిస్తామని టీజీ హెచ్చరించారు. టీజీ వ్యాఖ్యలను జగన్ వింటున్నారో - లేదో... తెలియదు గానీ... టీజీ గోల మాత్రం రోజుకో రీతిన కొత్త పుంతలు తొక్కుతోందన్న వాదన అయితే గట్టిగానే వినిపిస్తోంది.
Tags:    

Similar News