బ్రిటన్ ప్రధాని ఇంటి గేటు ను ఢీ కొట్టిన కారు.. ఆ టైంలో లోపల రిషి

Update: 2023-05-26 10:07 GMT
అమెరికా అధ్యక్షుడి అధికార నివాసమైన వైట్ హౌస్ గేటు ను ట్రక్కుతో ఢీ కొట్టిన ఉదంతానికి సంబంధించిన కలకలం ఒక కొలిక్కి రాక ముందే.. బ్రిటన్ ప్రధానమంత్రి నివాసం గేటు ను ఒక కారు వేగంగా వచ్చి ఢీ కొన్న వైనం తాజాగా చోటు చేసుకుంది. ఈ ఘటన జరిగిన వేళలో.. ప్రధాని నివాసంలో ప్రధాని  రిషి సునాక్ ఉండటం గమనార్హం. లండన్ లోని 10 డౌనింగ్ స్ట్రీట్ లో చోటు చేసుకున్న ఈ పరిణామం అక్కడ కలకలాన్ని రేపింది.

లక్కీగా ఈ ఘటన లో ఎవరూ గాయపడలేదు. ప్రధాని నివాసం గేటు ను కారు ఢీ కొన్న వెంటనే.. భద్రతా సిబ్బంది ఆ వీధిలోకి రాకపోకల్ని నిలిపేశారు. అధికార నివాసంలో ఉన్న అధికారులు ఎవరూ బయట కు రావద్దని హెచ్చరించారు. ఆ వెంటనే.. భారీ ఎత్తున తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో.. ప్రధాని రిషి సునాక్.. షెడ్యూల్ ప్రోగ్రాంలో హాజరయ్యేందుకు బయట కు వెళ్లాల్సి ఉండగా.. రోటీన్ గా వినియోగించే మార్గం నుంచి కాకుండా మరో మార్గం నుంచి ఆయన్ను బయట కు తీసుకెళ్లారు.

ఈ ఘటన జరిగిన కాసేపటి వరకు హైటెన్షన్ వాతావరణం నెలకొంది. తనిఖీల అనంతరం.. అనుమానాస్పదంగా ఏమీ లభించలేదు. కారు ఘటన చోటు చేసుకున్నంతనే ఆ వీధిలోకి వాహనాల రాకపోకల్ని నిలిపేసి.. వాహనాల్లో ఎవరైనా దుండగులు ఉన్నారా? అన్న సందేహంతో తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు. కారును డ్రైవ్ చేస్తున్న వ్యక్తి పై కేసు నమోదు చేశారు. ఈ పరిస్థితి చోటు చేసుకోవటానికి కారణాల్ని అధికారులు విచారిస్తున్నారు.

Similar News