చంద్రబాబుకు వినసొంపైన మాట చెప్పిన కేంద్రం..?

Update: 2022-02-02 10:30 GMT
కేంద్ర పెద్దలు బహు చక్కని మాట ఒకటి చెప్పారు. అది తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు తీయని మాటగా ఉంటుంది అనడంలో సందేహం లేదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా ఏపీకి  అమరావతిని రాజధానిగా ప్రకటించారు. దాన్ని ప్రపంచ రాజధాని చేయాలని కలలు గన్నారు. కానీ అదే అమరావతి కాస్తా జగన్ ఏలుబడిలో అడుగు ముందుకు వేయని పరిస్థితి ఏర్పడింది. ఇదే బాధ అనుకుంటే దీనికి మించి మరోటి అన్నట్లుగా మూడు రాజధానుల కాన్సెప్ట్ ని జగన్ తెర మీదకు తెచ్చారు.

అలా మూడేళ్ళుగా చూస్తే ఏపీకి రాజధాని ఏంటి అంటే ఎవరూ చెప్పలేని పరిస్థితి ఉంది. సివిల్స్ కి ప్రిపేర్ అయ్యే వారి నుంచి పాఠశాలలో చదివే పిల్లల వరకూ ఏపీ రాజధాని ఏదీ అన్న ఆ ఒక్క ప్రశ్నకు జవాబు రాయలేని అయోమయానికి చేరుకున్నారు. అలాంటి రాజధాని విషయంలో కేంద్రం పక్కా క్లారిటీగా ఒక మాట చెప్పింది.

ఏపీకి రాజధాని ఏది అని అని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కేంద్రాన్ని ప్రశ్నించారు. ఏపీ రాజధాని విషయంలో సందిద్గత నెలకొని ఉందని, మూడు రాజధానుల బిల్లుని కేంద్రం వెనక్కి తీసుకున్న తరువాత అసలు రాజధాని ఉందా లేదా అన్నది తెలియడంలేదని జీవీఎల్ తన సందేహాలను కేంద్ర మంత్రి ముందు పెట్టారు.  దానికి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ సమాధానం ఇస్తూ అమరావతియే ఏపీకి అసలైన రాజధాని అని పక్కా క్లారిటీ ఇచ్చేశారు. ఈ విషయంలో వేరే డౌటేలా అని అన్నట్లుగా కేంద్ర మంత్రి సీరియస్ రిప్లై ఇచ్చారని అనుకోవాలి.

మూడు రాజధానుల చట్టాన్ని ఏపీ సర్కార్ వెనక్కి తీసుకున్న విషయం తమ దృష్టికి కూడా వచ్చిందని, అందువల్ల ఏపీకి అమరావతే రాజధాని అని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.  కేంద్రం వద్ద ఉన్న సమాచారం మేరకు అయితే అమరావతి మాత్రమే ఏపీకి రాజధాని అని నిత్యానంద రాయ్ కుండబద్ధలు కొట్టారు. మొత్తానికి ఇది అమరావతి రైతుల విజయమే కాదు, తెలుగుదేశం విజయం కూడా అని అంతా అంటున్నారు.

ఇక ఏపీలో చూస్తే  వైసీపీకి ఉన్నది రెండేళ్ల పాలన మాత్రమే. ఈ టైం లో అమరావతి రాజధాని పేరిట మళ్లీ వైసీపీ ఏమైనా ప్రయోగాలు చేసే సీన్ అయితే ఇప్పటికి  ఉండకపోవచ్చు అని కూడా అంటున్నారు. ఇక ఎవరైనా  ఒకసారి చేస్తేనే దాన్ని  ప్రయోగం అంటారు, పదే పదే అది చేస్తే జనాలకు కూడా అది నచ్చదు, ఎవరూ ఒప్పరు కాబట్టి ఇక ఏపీకి అమరావతే అసలైన రాజధాని అని అంతా జనాలు  ఫిక్స్ అయిపోవచ్చు అంటున్నారు. సో అయిదు కోట్ల ఆంధ్రులు ఇపుడు తమ రాజధాని ఏది అంటే హ్యాపీగా అమరావతి అని రాసేసుకోవచ్చు అన్న మాట.
Tags:    

Similar News