ట్రాన్స్‌జెండర్‌ పట్ల వివక్ష తగదు: విజయసాయి రెడ్డి

Update: 2019-11-27 05:15 GMT
ట్రాన్స్‌జెండర్‌ పట్ల సమాజంలో కొనసాగుతున్న వివక్షను రూపుమాపాల్సి ఉందని వి.విజయసాయి రెడ్డి అన్నారు. ట్రాన్స్‌జెండర్‌ (హక్కుల పరిరక్షణ) బిల్లుపై మంగళవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ, తరతరాలుగా సమాజంలో ట్రాన్స్‌జండర్‌ వ్యక్తులు వివక్ష, అవహేళనకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

పౌరులకు  రాజ్యాంగం ప్రసాదించిన ప్రాధమిక హక్కులను కూడా వారికి నిరాకరించడం శోచనీయమని అన్నారు. ఈ నేపథ్యంలో ట్రాన్స్‌జెండర్‌ వర్గాల సంక్షేమం, వారి హక్కుల పరిరక్షణ కోసం ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు తమ పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆయన తెలిపారు.

సమాజంలో ట్రాన్స్‌జెండర్‌ వ్యక్తులు  నిత్యం ఎదుర్కొనే వివక్షను తొలగించడం ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం. థర్డ్‌ జెండర్‌ పేరిట ఆయా వర్గాలకు జరిగే అన్యాయాన్ని, వారిపట్ల అనుసరించే అనుచిత వైఖరిని రూపుమాపేందుకు ఈ బిల్లు ఎంతగానో తోడ్పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

అలాగే ఈ బిల్లు ద్వారా ట్రాన్స్‌జెండర్‌ సామూహికవర్గం ప్రయోజనాల పరిరక్షణతోపాటు వారికి విద్య, ఆరోగ్యం, ఉపాధి వంటి కనీస సదుపాయాలు పొందే చట్టబద్దమైన అర్హత లభిస్తుందని చెప్పారు. బిల్లులోనే సెక్షన్‌ 4 (2) ట్రాన్స్‌జెండర్‌గా ఒక వ్యక్తిని గుర్తించడం అన్నది స్వీయ ప్రకటిత లింగ గుర్తింపు ద్వారా అని చెబుతోంది.

ఈ విధంగా ఏ వ్యక్తి అయినా తనకు తాను ట్రాన్స్‌జెండర్‌ అని స్వయంగా ప్రకటించే అవకాశం కల్పించడం వలన తప్పుడు క్లైయిమ్‌ల ద్వారా ఆ సామాజికవర్గం పొందే ప్రయోజనాలు దుర్వినియోగం జరిగే అవకాశం ఉందని విజయసాయి రెడ్డి అన్నారు. జిల్లా మేజిస్ట్రేట్‌ జారీ చేసే గుర్తింపు పత్రం ద్వారా ఒక వ్యక్తిని ట్రాన్స్‌జెండర్‌గా గుర్తించవచ్చని బిల్లులో చెబుతున్నారు.

 అలాగే స్వయం ప్రకటిత మార్గం ద్వారా కూడా ట్రాన్స్‌జెండర్‌ను గుర్తించడం జరుగుతుందని బిల్లులో చెబుతున్నారు. ఈ వైరుధ్యంపై బిల్లులో ఎక్కడ స్పష్టత, వివరణ లేదని అన్నారు. దేశంలో తీవ్ర నిర్లక్ష్యానికి, నిరాదరణకు గురైన ట్రాన్స్‌జెండర్‌ సామూహిక వర్గం సమస్యలను మానవతా దృక్పథంతో పరిశీలించి ఈ బిల్లుకు మద్దతు తెలపాలని ఆయన సభలోని అన్ని పక్షాలకు విజ్ఞప్తి చేశారు.
Tags:    

Similar News