మోడీ ప్రైవేట్ పరం చేయాలనుకుంటున్న ప్రభుత్వ సంస్థలు ఇవే..

Update: 2021-03-10 02:30 GMT
2014 నుంచి అధికారంలో ఉన్న మోడీ దేశంలో అనేక సంస్కరణలు ప్రవేశపెడుతున్నాడు. నల్లధనాన్ని తెల్లగా మార్చడం కోసం నోట్ల మార్పిడి లాంటివి చేశాడు. వాటి ద్వారా ఫలితం ఎలా ఉన్నా ప్రధాని నిర్ణయంలో మాత్రం ఎటువంటి వెనుకడుగు ఉండదని తెలుస్తోంది. అయితే ఇందులో భాగంగా ప్రభుత్వ సంస్థల్లో కొన్నింటిని ప్రైవేట్ పరం చేయడంలోనూ మోడీ ముందడుగు వేస్తున్నాడు. ఇప్పటికే రైతుచట్టాలను ప్రవేశపెట్టిన మోడీ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో కొన్ని ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేసేందుకు రంగం సిద్ధం చేశాడు.

నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణతోనే లాభ పడుతాయని మోడీ ఎప్పటినుంచో చెబుతున్నాడు. దేశంలోని 35  ప్రభుత్వ రంగ సంస్థలు గడిచిన ఐదేళ్లలో తీవ్ర నష్టాలు చూశాయట. దీంతో వాటిని ప్రైవేట్ పరం చేయాలని మోడీ అనుకుంటున్నాడట. ఇదే విషయాన్ని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయమంత్రి అర్జున్ రామ్ మేఘ్ వాల ప్రకటించారు. 2016లో కేంద్రం ఆధీనంలో ఉన్న 35 ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులను ఉపసంహరించుకొని వాటిని ప్రైవేట్ పరం చేస్తారట.

35 సంస్థల్లో 8 సంస్థల్లో ఇప్పటికే ప్రైవేటీకరణ పూర్తయిందని వాటిని వదులుకోవడం ద్వారా రూ.66,712 కోట్ల ఆదాయం వచ్చిందని తెలుస్తోంది. 2019-20 నాటికి 35 ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా రూ.30,131 కోట్ల నష్టం వచ్చిందట. ఈ నష్టాన్ని భర్తీ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

ఇక 2021-22 నాటికి మిగతా సంస్థలను ప్రైవేట్ పరం చేసి రూ.1.75 లక్షల కోట్లు ఆర్జించాలని కేంద్రం భావిస్తోందట. అయితే నష్టాల్లో నడుస్తున్న కంపెనీల్లో 50,291 మంది ఉద్యోగులు భవిష్యత్తు అంధకారంగా మారనుంది. కాగా కేంద్ర పెట్టుబడులు ఉపసంహరించుకున్న ప్రభుత్వ రంగ సంస్థల్లో హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్, హాస్పిటల్ సర్వీసెస్ కన్సల్టెన్సీ కార్పొరేషన్, హిందుస్థాన్ న్యూస్ ప్రింట్ లిమిటెడ్, టీమెచ్డీసీ ఇండియా లిమిటెడ్ లాంటివి ఉన్నాయి.
Tags:    

Similar News