ఈ నగరాలు మహిళలకు డేంజర్ అట.. అస్సలు వెళ్లకండి!

Update: 2022-08-30 11:30 GMT
ఎన్ని చట్టాలు తెచ్చినా.. 'దిశ' లాంటి కఠిన చట్టాలు పెట్టినా కూడా మహిళలకు దేశంలో రక్షణ లేకుండా పోతోంది.  ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో మహిళలకు భద్రతే లేదని తేటతెల్లమైంది. దేశ రాజధానిలో గత ఏడాది ప్రతీరోజూ ఇద్దరు మైనర్ అమ్మాయిలపై రేప్ లు జరిగాయని ఎన్.సీఆర్బీ రిపోర్ట్ వెల్లడించింది. 2021లో ఢిల్లీలో మహిళలపై 13892 నేరాలు జరిగినట్లు కేసులు నమోదయ్యాయి.

2020లో ఢిల్లీలో 9782 కేసులు నమోదయ్యాయి. అంటే ఏడాది వ్యవధిలోనే 40 శాతం కేసులు అధికంగా నమోదు కావడం సంచలనమైంది.

దేశంలోని 19 మెట్రో పాలిటన్ నగరాల్లో మహిళలపై నేరాల వివరాలను పరిశీలిస్తే ఒక్క ఢిల్లీలోనే 32.20 శాతం మహిళలపైనేరాలు జరగడం అందరినీ షాక్ కు గురిచేసింది. ఢిల్లీ తర్వాత స్థానంలో మహిళలకు భద్రత లేని నగరం 'ముంబై' కావడం గమనార్హం. ఇక్కడ మహిళలపై 5543 నేరాలు నమోదయ్యాయి. ఆ తర్వాత బెంగళూరులో 3127 కేసులు  నమోదు అయ్యాయి.

19 నగరాల్లో నమోదైన నేరాల్లో ముంబై వాటా 12.76  శాతం కాగా.. బెంగళూరు వాటా 7.2 శాతంగా ఉంది.  ఒక్క మాటలో చెప్పాలంటే దేశంలోని 19 మెట్రో పాలిటన్ నగరాల్లో మహిళలపై జరుగుతున్న 50 శాతానికిపైగా కేవలం ఢిల్లీ , ముంబై, బెంగళూరు నగరాల్లోనే చోటుచేసుకుంటున్నాయి. ఇందులో కిడ్నాప్ (3948), భర్తల చేతిలో గృహ హింస(4674), చిన్నారులపై అఘాయిత్యాలు(833) సైతం ఢిల్లీలోనే ఎక్కువగా నమోదయ్యాయి.

గత ఏడాది ఢిల్లీలో సగటున రోజుకు ఇద్దరు చొప్పున అమ్మాయిలపై రేప్ లు జరిగాయి. దేశంలో 20 లక్షల జనాభా కంటే ఎక్కువ ఉన్న 19 మెట్రో నగరాల్లో గత ఏడాది మహిళపై 43414 నేరాలు నమోదు కాగా.. ఒక్క ఢిల్లీలోనే 13982 నమోదయ్యాయి.

ఢిల్లీలో గత ఏడాది వరకట్న వేధింపుల మరణాలకు సంబంధించి 136 కేసులు నమోదయ్యాయి. 19 మెట్రో నగరాల్లో నమోదైన  వరకట్న వేధింపుల మరణాల కేసుల్లో ఇది 36.26 శాతం.. గత ఏడాది దేశం మొత్తం మీద మహిళలు కిడ్నాప్, అపహరణ కేసులు 8664 నమోదు కాగా.. ఢిల్లీలో 3948 కేసులు నమోదయ్యాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News