ఈసారి దెందులూరు మండలం కొమిరేపల్లిలో వింత వ్యాధి

Update: 2021-02-07 04:40 GMT
ఏమైందో తెలీదు కానీ.. ఇటీవల కాలంలో ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో వింత వ్యాధి ప్రబలటం.. కొన్ని రోజుల పాటు ప్రజలు తీవ్ర అవస్థలకు గురి కావటం తెలిసిందే. ఏలూరులో ఇదే తరహాలో చోటు చేసుకున్న ఉదంతంలో పెద్ద సంఖ్యలో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. అంతుచిక్కని విధంగా వ్యవహరిస్తూ ప్రజలు అనారోగ్యానికి కారణమైన ఉదంతానికి నీటి కాలుష్యం కారణమని చెప్పారు. ఏలూరుతో పాటు.. మరికొన్ని ప్రాంతాల్లోనూ ఇదే తరహాలో విచిత్ర వ్యాధి లక్షణాలు కనిపించాయి.

తాజాగా పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం కొమిరేపల్లిలో వింత వ్యాధి ఒకటి రేగి కలకలం రేపుతోంది. గ్రామానికి చెందిన మహేశ్ అనే యువకుడు కళ్లు తిరిగి పడిపోయాడు. మరో వ్యక్తి కళ్లు తిరుగుతున్నాయని చెప్పటంతో అతడ్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మహేశ్ నోటి వెంట నురగలు రావటం.. కాళ్లు.. చేతులు కొట్టుకోవటంతో ఆందోళన చెందిన గ్రామస్తులు 108కు ఫోన్ చేశారు. అనంతరం అతడ్ని ఏలూరుకు తరలించారు.

ఆసుపత్రికి తరలించే వేళలో మళ్లీ స్ప్రహలోకి వచ్చిన అతడ్ని.. ఆసుపత్రిలో ప్రధమ చికిత్స చేసి ఇంటికి పంపారు. గత నెలలోనూ ఇదే గ్రామానికి చెందిన 27 మంది వింత వ్యాధి బారినపడటం.. తాజాగా అలాంటి లక్షణాలు కనిపించటంతో అక్కడి ప్రజలు ఉలిక్కిపడుతున్నారు. దేశంలో మరెక్కడా కనిపించని ఈ తరహా వింత వ్యాధులు ఏపీలోనూ తరచూ ఎందుకు వస్తున్నాయి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
Tags:    

Similar News