మూడు ముచ్చట కంటిన్యూ... ఎందుకంటే... ?

Update: 2022-03-04 23:30 GMT
వైసీపీ మూడు వీడడంలేదు, మూడ్ మార్చుకోవడంలేదు. ఎందుకంటే ఇది పక్కా రాజకీయ వ్యూహం. మూడు రాజధానుల అంశం తెర మీదకు తీసుకురావడంతోనే చాలా కధ ఉంది. ఏపీని ఏకమొత్తంగా చూడకుండా ఎక్కడికక్కడ విడగొట్టి, అందులో తమదైన రాజకీయం పండించుకుందామన్నది వైసీపీ ప్లాన్.

ఆ విషయం తెలుగుదేశానికి బాగా ఆర్ధమైంది. అయినా సరే తాను క్రియేట్ చేసిన అమరావతి రాజధానికి కాపాడుకోవడం ఆ పార్టీ నైతిక, రాజకీయ బాధ్యత. అదే సమయంలో మిగిలిన రెండు ప్రాంతాలకు కూడా ఏదో ఒకటి చేసేలా ప్లాన్స్ అయితే చేయాల్సి ఉంది. సరే రాజధానులు మూడు, అన్ని ప్రాంతాల అభివృద్ధి అని వైసీపీ ఊరిస్తోంది. ఇప్పటికి మూడేళ్ళు గడచాయి. ఏ ఒక్క చోటా అభివృద్ధి పేరిట ఒక్క ఇటుక కూడా పడలేదు.

దాంతో పాటు ఏపీకి రాజధాని లేదు అన్న విమర్శలు కూడా వెల్లువెత్తాయి. ఈ క్రమంలో కోర్టు తీర్పుతో ఏపీకి అమరావతే అసలైన రాజధాని అని లోకానికి చెప్పినట్లు అయింది. ఇక ఇదే తుది తీర్పు కూడా అని అనుకోవాలి. సుప్రీం కోర్టుకు వెళ్లినా దీనికి భిన్నంగా తీర్పు వచ్చే చాన్స్ అయితే లేదు అన్నది మరో మాటగా చెబుతున్నారు.  అయితే వైసీపీ మాత్రం మూడు రాజధానుల విషయం విడిచి పెట్టే ప్రసక్తి లేదు.

ఎందుకంటే అక్కడే ఆ పార్టీ వ్యూహాలు ఉన్నాయి కాబట్టి. సో మంచి రోజు చూసుకుని సుప్రీం కోర్టుకు ప్రభుత్వం వెళ్లడం ఖాయం. ఆ తీర్పు ఎలా వచ్చినా కూడా జనాలలో అయితే టీడీపీ మీద అసమ్మతిని రాజేయడానికి వైసీపీ తన ఆయుధాలను రెడీ చేసుకుని ఉందని అంటున్నారు. ఉత్తారాంధ్రా, రాయలసేమలు బాగా వెనకబడి ఉన్నాయని, వాటికి తాము రాజధానులు ఇచ్చి మేలు చేద్దామనుకుంటే తెలుగుదేశం అంతా అడ్డం కొట్టిందని ప్రచారం చేయడం ద్వారా పసుపు పార్టీ మీద వ్యతిరేకత రాజేయడం వైసీపీ చేసే పని.

అయితే ఇక్కడ టీడీపీకి ధీమా ఏంటి అంటే అమరావతి రాజధాని  లాంటి సెంటిమెంట్ మిగిలిన చోట లేదు అన్నది. ఒకవేళ ఉంటే కనుక జగన్ సర్కార్ మూడు రాజధానుల చట్టాన్ని రద్దు చేసినపుడే ఆయా జిల్లాల్లో ఉద్యమాలు లేచేవి అన్నది కూడా ఒక లెక్కగా ఉంది. అయినా సరే వైసీపీ రాజకీయం ఆ పార్టీ చేస్తుంది. వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం తాము పాటుపడాలనుకుంటే బ్రేకులు వేస్తున్నదెవరో గుర్తించాలని జనాలను కోరుతుంది.

ఇదంతా 2024 ఎన్నికలు ఒక ఆయుధంగా మార్చుకొవాలని వైసీపీ చూస్తుంది అని అంటున్నారు. మరి అప్పటివరకూ ఏం చేస్తుంది అంటే అమరావతినే రాజధానిగా ఉంటుంది. కానీ వైసీపీ అక్కడ ఎంత మేరకు అభివృద్ధి చేస్తుంది అన్నది మాత్రం ఎవరూ చెప్పలేరు. దానికి మూడు కారణాలు, ఒకటి నిధుల లేమి, రెండవది నిరాసక్తత. మూడవది పూర్తిగా రాజకీయం. మొత్తానికి చూస్తే 2024 వరకూ మూడు రాజధానుల వూసు అయితే అలా వినిపిస్తూనే ఉంటుంది అన్నది వాస్తవం.
Tags:    

Similar News