మూడు రాజ‌ధానుల‌కు ఆ ఎన్నిక‌లు రెఫ‌రండం అవుతాయా!

Update: 2020-01-03 08:42 GMT
ఏపీలో ఎన్నిక‌ల సంద‌డి రాబోతోంది. ఇప్ప‌టికే స్థానిక ఎన్నిక‌ల‌కు సంబంధించిన రిజ‌ర్వేష‌న్లు దాదాపుగా ఖ‌రారు అవుతున్నాయి. జిల్లాల వారీగా ఎంపీటీసీ - జడ్పీటీసీ ఎన్నిక‌ల‌కు సంబంధించి రిజ‌ర్వేష‌న్ల‌ను ప్ర‌క‌టన వ‌స్తోంది. ఏ స్థానం ఎవ‌రికి రిజ‌ర్వ్ అవుతోంద‌నే అంశాల గురించి స్థానికంగా క్లారిటీ వ‌స్తోంది. వాస్తవానికి ఏపీలో ఎంపీటీసీ - జ‌డ్పీటీసీ ఎన్నిక‌లు ఎప్పుడో జ‌ర‌గాల్సింది. రెండేళ్ల కింద‌టే ఎన్నిక‌ల ప్ర‌క్రియ మొద‌లు కావాల్సింది. అయితే అప్పట్లో చంద్ర‌బాబు స‌ర్కారు వాటి నిర్వ‌హ‌ణ‌కు అంత ఆస‌క్తి చూప‌లేదు. దీంతో అవి అలా వాయిదా ప‌డుతూ వ‌స్తున్నాయి.

ఇప్పుడు స్థానిక ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు జ‌గ‌న్ ప్ర‌భుత్వం ముందుకు వ‌స్తోంది. ఇప్ప‌టికే రిజ‌ర్వేష‌న్లు ఖ‌రారు పూర్తి అయ్యింది దాదాపు. ఈ నేప‌థ్యంలో ఈ ఎన్నిక‌ల ఫ‌లితాలు ఏడు నెల‌ల జ‌గ‌న్ పాల‌న‌కు ఒక ర‌కంగా రెఫ‌రండం లాంటివే అని చెప్ప‌వ‌చ్చు. మ‌రో రెండు నెల‌ల్లో ఈ ఎన్నిక‌ల ప్ర‌క్రియ ముగుస్తుంది. దీంతో మొత్తం తొమ్మిది నెల‌ల‌కు రెఫ‌రండం అని అంచ‌నా వేయవ‌చ్చు.

అంత క‌న్నా ఆస‌క్తిదాయ‌క‌మైన అంశం ఏమిటంటే.. ఒక‌వైపు ఇప్పుడు ఏపీలో మూడు రాజ‌ధానుల ర‌చ్చ జ‌రుగుతూ ఉంది. సీఎం జ‌గ‌న్ మోహన్ రెడ్డి మూడు రాజ‌ధానుల ప్ర‌తిపాద‌న చేశారు. దీన్ని తెలుగుదేశం పార్టీ వ్య‌తిరేకిస్తూ ఉంది. అమ‌రావ‌తి ప్రాంతానికే రాజ‌ధాని ప‌రిమితం కావాల‌నేది తెలుగుదేశం అజెండా. విశాఖ‌ - క‌ర్నూలుల‌కు రాజ‌ధానిలో భాగ‌స్వామ్యాన్ని తెలుగుదేశం పార్టీ పూర్తిగా వ్య‌తిరేకిస్తూ ఉంది. ఆ ప్రాంత టీడీపీ నేత‌లు కూడా చంద్ర‌బాబుకు త‌గిన‌ట్టుగానే మాట్లాడుతూ ఉన్నారు. త‌మ ప్రాంతాలు ఏమై పోయినా ఫ‌ర్వాలేదు  రాజ‌ధాని మాత్రం అమ‌రావ‌తిలోనే ఉండాలంటూ.. వారు కూడా వాదిస్తున్నారు. స్వ‌యంగా చంద్ర‌బాబు నాయుడు, ఆయ‌న భార్య కూడా అమ‌రావ‌తిలో దీక్ష‌కు దిగారు.

మూడు ప్రాంతాల విష‌యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు సానుకూలంగా ఉంటే, టీడీపీ మాత్రం అమ‌రావ‌తి మాత్రం అని అంటోంది. ఈ నేప‌థ్యంలో ఈ ఇరు వాద‌న‌ల విష‌యంలో కూడా స్థానిక ఎన్నిక‌లు రెఫ‌రండం లాంటివి కాబోతున్నాయ‌ని ప‌రిశీల‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.


Tags:    

Similar News