జ‌మిలి ఎంత ఖ‌రీదైన వ్య‌వ‌హారమంటే..?

Update: 2018-07-07 05:05 GMT
రాజ‌కీయంగా ప్ర‌యోజ‌నం క‌లుగుతుందంటే దేనికైనా రెఢీ అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించే రాజ‌కీయ పార్టీల‌కు దేశంలో కొద‌వ లేదు. అధికార‌ప‌క్షంగా వెలిగిపోతున్న పార్టీతో స‌హా.. విప‌క్ష‌పార్టీల్ని వేటినీ గొప్ప‌గా కీర్తించ‌లేని ప‌రిస్థితి. ఇదిలా ఉంటే.. కేంద్ర‌.. రాష్ట్రాల ఎన్నిక‌ల్ని ఒకేసారి నిర్వ‌హించాల‌న్న ప్ర‌ధాని ఆశ‌.. చాలా ఖ‌రీదైన వ్య‌వ‌హార‌మ‌న్న‌ది తాజాగా తేలింది. దేశ వ్యాప్తంగా ఒకేసారి లోక్ స‌భ‌కు.. అసెంబ్లీకి ఎన్నిక‌లు నిర్వ‌హిస్తే బాగుంటుంద‌న్న ఆలోచ‌న‌ను మోడీ చాలాకాలంగా చేస్తున్నారు.

ప్ర‌తి ఆర్నెల్ల‌కు.. ఏడాదికి ఒక‌సారి ఏవో రాష్ట్రానికి చెందిన ఎన్నిక‌లు తెర మీద‌కు రావ‌టం.. కేంద్రంలో కొలువు తీరిన పార్టీతో స‌హా.. రాజ‌కీయ‌పార్టీల‌కు ఇబ్బందిక‌రంగా మారింది. అధికార‌ప‌క్షానికి ఎప్ప‌టిక‌ప్పుడు ఎన్నిక‌ల గండాలు లేకుండా చేసే జ‌మిలి ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు సంబంధించిన  ఓప‌క్క ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతున్న వేళ‌లోనే.. మ‌రోవైపు దీనిపై అధికారిక నిర్ణ‌యం తీసుకునే దిశ‌గా మోడీ ప‌రివారం పావులు క‌దుపుతోంది.

రాజ‌కీయ పార్టీల‌న్నింటిని ఒక వేదిక మీద‌కు తీసుకొచ్చి.. జ‌మిలి ఎన్నిక‌ల‌కు సానుకూల‌త వ్య‌క్తం చేసేలా మోడీ ప‌రివారం వ్యూహాల‌కు ప‌దునెక్కిస్తోంది. ఇందులో భాగంగా ఈ రోజు.. రేపు (శనివారం.. ఆదివారం) ఢిల్లీలో ఏడు జాతీయ పార్టీలు.. 59 ప్రాంతీయ‌ పార్టీల‌తో స‌మావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ స‌మావేశంలో పార్టీలు చెప్పే అభిప్రాయానికి అనుగుణంగా త‌దుప‌రి ప‌రిణామాలు చోటు చేసుకుంటాయ‌ని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే జ‌మిలి ఎన్నిక‌ల‌పై ఇప్ప‌టివ‌ర‌కూ సానుకూల వాద‌న‌లు వినిపించిన మోడీ వ‌ర్గానికి భిన్నంగా.. ఈ ఎన్నిక‌ల‌తో జ‌రిగే న‌ష్టం గురించి ఆస‌క్తిక‌ర వాద‌న ఒక‌టి షురూ అయ్యింది. మ‌రోవైపు ఒకేసారి ఎన్నిక‌లు నిర్వ‌హించే అంశంపై కేంద్ర న్యాయ‌శాఖ‌కు లా క‌మిష‌న్ నివేదిక ఇచ్చింది. ఇందులోలా క‌మిష‌న్  మూడు అంశాల్ని ప్ర‌శ్నించింది. అందులో మొద‌టిది.. జ‌మిలితో ఎన్నిక‌ల వ్య‌యం నిజంగా త‌గ్గ‌తుందా?  2. భార‌త ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌కు ఇది విఘాతం క‌లిగించ‌దా?  3. దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నిక‌ల రూల్ అమ‌ల్లోకి వ‌స్తే అభివృద్ది కార్య‌క్ర‌మాల‌కు ఆటంకం క‌ల‌గ‌దా? అన్న సందేహాల్ని వ్య‌క్తం చేసింది.

లా క‌మిష‌న్ తెర మీద‌కు తెచ్చిన అనుమానాల‌కు త‌గ్గ‌ట్లే ఒకేసారి ఎన్నిక‌ల ఖ‌ర్చుకు సంబంధించి కొత్త లెక్క ఒక‌టి చెబుతున్నారు. ఒకేసారి ఎన్నిక‌ల్ని నిర్వ‌హించాలంటే 23 ల‌క్ష‌ల ఈవీఎంలు.. 25 ల‌క్ష‌ల వీవీపాట్ యూనిట్లు అవ‌స‌ర‌మ‌ని.. వాటిని స‌మ‌కూర్చుకోవ‌టానికి రూ.10వేల కోట్లు ఖ‌ర్చు చేయాల‌ని చెబుతున్నారు. అయితే.. ఈవీఎంల కాల‌ప‌రిమితి కేవ‌లం ప‌దిహేనేళ్లు మాత్ర‌మే. అంటే.. మూడో ట‌ర్మ్ త‌ర్వాత ఈవీఎంలు ప‌ని చేయ‌వు. ఇంత‌దానికి రూ.15వేల కోట్ల భారీ మొత్తాన్ని ఖ‌ర్చు చేయ‌టంలో అర్థ‌ముందా? అన్న‌ది ప్ర‌శ్న‌గా మారింది. జ‌మిలి అంటూ ముచ్చ‌ట‌గా మూడక్ష‌రాల్లో క‌నిపించే ఈ వ్య‌వ‌హారం వెనుక ఖ‌ర్చు ఇంత భారీనా? అన్నదిప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. మ‌రి.. దీనిపై జాతీయ‌.. ప్రాంతీయ పార్టీలు ఎలా రియాక్ట్ అవుతాయో చూడాలి.


Tags:    

Similar News