టోటల్ గా రూపురేఖలే మారిపోయాయిగా..?

Update: 2022-01-28 13:30 GMT
జిల్లా అంటే ఉండే రాజసం, ఆ దర్పం దర్జాకు నిన్నటి దాకా అవి నిలువెత్తు రూపాలుగా నిలిచేవి. గుంటూర్ జిల్లా అంటే గొప్పగా చెప్పుకునేవారు. మాది పెద్ద జిల్లా అని గర్వించేవారు, ఇక తూర్పు గోదావరి జిల్లా తీరు కూడా అలాగే ఉండేది. అతి పెద్ద జిల్లాగా పేరు సార్ధకం చేసుకుంది. అలాగే విశాఖ జిల్లా కూడా ఏపీలో ముందు వరసలో ఉండేది. కొత్త జిల్లా పేరుతో వీటిని మూడేసి ముక్కలు చేసి పారేశారు. దాంతో భౌగోళిక విస్తీర్ణంతో పాటు సామాజిక, రాజకీయ  రూపు రేఖలు మొత్తం తారు మారు అయిపోయాయి.

విశాఖ జిల్లా ఇపుడు ఏపీలోనే అతి చిన్న జిల్లా అంటే ఆ ప్రాంత వాసులే నమ్మలేని పరిస్థితి. మా జిల్లాకు ఉన్న ప్రాధాన్యత ఇపుడు పోయింది అని వగచేవారూ పెద్ద ఎత్తున కనిపిస్తున్నారు. గోదావరి జిల్లాలను గురించి చెప్పుకుంటే ఏపీలో రాజకీయ పార్టీల జాతకాలను తారుమారు చేస్తారని అనేవారు. అలాంటి ధిలాసా అయితే ఇపుడు లేనే లేదు అని చెప్పాలి.

అంతే కాదు, జనాభా పరంగా చూసుకున్నా, ఇతరత్రా సామాజిక సమీకరణలను చూసుకున్నా కూడా పాత జిల్లాలు సమూలమైన మార్పులకు గురి కాబోతున్నాయని చెప్పకతప్పదు. ఒక జిల్లాలో ఉన్న మండలాలను వేరొక జిల్లాలో కలిపేశారు. అలాగే నిన్నటిదాకా కలసి ఉన్న నియోజకవర్గాలను తీసుకెళ్ళి కొత్త వాటిలో విలీనం చేయడంతో సామాజికవర్గాల పరంగా కూడా దెబ్బ పడే అవకాశం ఉంది అంటున్నారు.

ఇక ముందుగా భౌగోళిక విస్తీర్ణం గురించి మాట్లాడుకుంటే కొత్త జిల్లాల్లో ప్రకాశం జిల్లా టాప్ ప్లేస్ లో ఉంది. ఆ జిల్లా విస్తీర్ణం చూస్తే 14,322 చదరపు కిలోమీటర్లుగా ఉంది. అంటే ఏపీ మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో ప్రకాశం జిల్లా 8.8 శాతాన్ని ఆక్రమించుకుంది. ఇక 12,251  చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో అల్లూరి సీతారామరాజు జిల్లా రెండవ స్థానంలో ఉంది. 11,359 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో అనంతపురం జిల్లా మూడవ స్థానంలో ఉంది.

విశాఖ రాజధాని అని ఊదరగొట్టారు. అలాంటి జిల్లా ఇపుడు కేవలం  928 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో చిట్ట చివరి స్థానంలో ఉంది. ఏపీలో మొత్తం విస్తీర్ణంతో విశాఖ వాటా ఎంత అని చూస్తే 0.6 శాతం అని తెలుస్తోంది. ఇక ఇపుడు జనాభా పరంగా లెక్క తీస్తే ఏపీలో మొదటి స్థానంలో కర్నూలు  ఉంది. ఆ జిల్లా జనాభా  23.66 లక్షలుగా ఉంది. అలాగే ఇరవై లక్షల పైగా జనాభా కలిగి ఉన్న జిల్లాలు చూస్తే వాటిలో అనంతపురం, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, శ్రీకాకుళం, శ్రీ బాలాజీ, గుంటూరు, పల్నాడు, ఏలూరు జిల్లాలు ఉన్నాయి.

అదే విధంగా గిరిజునల కోసం ఏపాటు చేసిన మన్యం జిల్లాలో 9.72 లక్షల జనాభా ఉంటే అల్లూరి జిల్లా 9.54 లక్షల జనాభా ఉంది. మొత్తం ఇరవై ఆరు జిల్లాలలో పద్నాలుగు జిల్లాలకు ఏడేసి అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు,  రెండేసి రెవిన్యూ డివిజన్లు ఉంటే పది జిల్లాలలో  మూడేసి రెవిన్యూ డివిజన్లు ఉన్నాయి. అత్యధిక మండలాల లెక్క తీసుకుంటే ప్రకాశం జిల్లా 38 మండలాల్తో ఫస్ట్ ప్లేస్ కొట్టేసింది.

అదే వరసలో నెల్లూరు జిల్లా 35 మండలాలు, శ్రీ బాలాజీ 35, అనంతపురం, కడప 34 మండలాలు ఉన్నాయి. ఏపీలో ఎన్నికలు అంటేనే కులాల ప్రభావం అధికంగా ఉంటుంది. ఇపుడు ప్రభావంతమైన కులాలు జిల్లాల మధ్య చీలిపోయినట్లుగా కనిపిస్తున్నాయి. ఈ మొత్తం మార్పుచేర్పులతో మరి కొన్ని కులాలు కూడా ముందుకు వస్తున్నాయి. దాంతో కొత్త జిల్లాల ఏర్పాటు ద్వారా అధికార పార్టీతో  రాజకీయ ప్రయోజనం పొందాలనుకున్నా వాటిని ఎలా సర్దుబాటు చేసుకుంటారో చూడాలి. విపక్ష పార్టీలు కూడా దీని మీద పూర్తి పరిశీలన చేస్తేనే తప్ప షేపూ రూపూ అర్ధమే కాదని చెబుతున్నారు.   ఏది ఏమైనా పెద్ద జిల్లాలు వాటి వైభవం అంతా గత కాలం కీర్తిగానే మిగిలిపోనుంది అని చెప్పవచ్చు.
Tags:    

Similar News