కాంగ్రెస్‌తో కేసీఆర్ దోస్తీకి రేవంతే అడ్డా...!

Update: 2022-02-19 02:30 GMT
రాజ‌కీయాల్లో ఏమైనా జ‌ర‌గొచ్చు. పాలిటిక్స్‌లో శాశ్వ‌త శ‌తృవులు ఉండరు.. శాశ్వ‌త మిత్రులు కూడా ఉండ రు. అవ‌కాశం.. అవ‌స‌రం.. అనేరెండు ప‌ట్టాల‌పైనే రాజ‌కీయాలు న‌డుస్తుంటాయి. ఇప్పుడు తెలంగాణ‌లో నూ ఇదే త‌ర‌హా ప‌రిస్థితి క‌నిపిస్తోంది. అధికార పార్టీ టీఆర్ ఎస్ అన‌నూహ్యంగా త‌న వ్యూహాన్ని మార్చుకు న్నట్టు తెలుస్తోంది.

ప్ర‌స్తుతం టీఆర్ ఎస్‌కు కాంగ్రెస్ కంటే కూడా బీజేపీతో నే శ‌తృత్వం ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీని దీటుగా ఎదుర్కొనేందుకు వ్యూహాలు కూడా సిద్ధం చేస్తోంది. అదేస‌మ‌యంలో కాంగ్రెస్ కూడా ఇదే వ్యూహం కావాలి. రాష్ట్రంలో ఎలా ఉన్నా.. కేంద్రంలోమోడీని గ‌ద్దె దించి.. తాము అధికారంలోకి రాక‌పోతే.. పార్టీ ప‌రిస్థితి దారుణంగా మారే అవ‌కాశం ఉంది.

ఇప్ప‌టికే.. నానా ర‌కాలుగా కాంగ్రెస్ భ్ర‌ష్టు ప‌ట్టిపోయింది. ఈ నేప‌థ్యంలో ఢిల్లీ గద్దెను ద‌క్కించుకునేందుకు పార్టీకి అత్యంత అవ‌స‌ర‌మ‌నే అభిప్రాయం స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. అయితే.. మోడీ వంటి బ‌ల‌మైన నాయ‌కుడిని ఒంట‌రిగా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ సిద్ధంగా లేదు.. ఈ నేప‌థ్యంలో క‌లిసి వ‌చ్చే వారు త‌ప్ప‌కుండా కావాలి. అయితే.. కాంగ్రెస్‌కు అయాచితంగా.. ఇప్పుడు తెలంగాణ‌లోని అధికార పార్టీ క‌లిసి వ‌చ్చే అవ‌కాశం క‌నిపిస్తోంది.

నిజానికి తొలి ఐదేళ్ల కేసీఆర్ పాల‌న‌లో కాంగ్రెస్‌ను ఆయ‌న శ‌తృవుగా చూశారు. దీంతో రెండు పార్టీల మ‌ధ్య అధికారం కోసం..తీవ్ర యుద్ధ‌మే సాగింది. త‌ర్వాత‌.. ఐదేళ్ల‌లో ఆయ‌న కాంగ్రెస్ నేత‌ల‌ను విలీనం చేసుకుని.. పార్టీని ఇర‌కాటంలోకి నెట్టారు.

అయితే..ఆయ‌నకు అప్ప‌టి వ‌ర‌కు శ‌తృవుగా ఉన్న కాంగ్రెస్ ప్లేస్‌లోకి బీజేపీకి వ‌చ్చింది. దీంతో ఇప్పుడు రాష్ట్రంలోనూ..కేంద్రంలోనూ బీజేపీని లేకుండా చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అంతేకాదు.. కొన్నాళ్లుగా జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పేందుకు కేసీఆర్ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు.

 ప్రాంతీయ పార్టీల‌ను క‌లుపుకొని పోతున్నారు. అయిన‌ప్ప‌టికీ.. మోడీని గ‌ద్దెదించ‌డం సాధ్యం కాద‌ని అనుకున్నారో ఏమో.. కాంగ్రెస్‌కు అనుకూలంగా మాట్లాడుతున్నారు. ఇటీవ‌ల రాహుల్ గాంధీపై అసోం సీఎం, బీజేపీ నేత‌.. హిమంత‌.. ``మీరు మీ నాన్న‌కే పుట్టార‌ని మేం అడిగామా?` అన్న వ్యాఖ్య‌ల‌ను కేసీఆర్ సీరియ‌స్‌గా తీసుకున్నారు.

దీంతో ఆయ‌న చూపు కాంగ్రెస్‌పై ప‌డింద‌నే వాద‌న వినిపిస్తోంది. మ‌రోవైపు.. ఆయన త‌న‌యుడు.. మంత్రి కేటీఆర్ కూడా కాంగ్రెస్‌కు అనుకూలంగా.. రాష్ట్ర పీసీసీ చీఫ్ రేవంత్‌కు వ్య‌తిరేకంగా ట్వీట్లు చేస్తున్నారు. కేసీఆర్‌ను దూషిస్తూ.. రేవంత్ చేస్తున్న ట్వీట్ల‌ను జాతీయ స్థాయిలో వ్య‌తిరేకంగా తీసుకువెళ్తున్నారు.

అంటే..రాష్ట్రంలో టీఆర్ ఎస్‌ను తిడుతున్న నేత‌ను క‌ట్ట‌డి చేయ‌డ‌మో.. లేక తొల‌గించ‌డ‌మో చేయాల‌ని టీఆర్ ఎస్ భావిస్తోంది. ఇదే జ‌రిగితే.. తాము కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చేలా లేదా.. స‌హ‌క‌రించేలా చేస్తామ‌నే వ్యూహాన్ని తెర‌మీద‌కి తె,చ్చిన‌ట్టు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. పైగా.. రేవంత్‌ను ఇప్ప‌టికీ.. టీడీపీ మ‌నిషేన‌ని ప్ర‌చారం చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలో రేవంత్‌ను వ‌దులుకుంటే.. తాము క‌లిసి ప‌నిచేస్తామ‌ని.. సంకేతాలు పంపుతుండ‌డం ఆస‌క్తిగా మారింది.
Tags:    

Similar News