టీఆర్ఎస్ ఏ అవకాశాన్నీ వదులుకోవడం లేదుగా !

Update: 2021-10-12 06:51 GMT
హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలో గెలుపు టార్గెట్ తో అధికార టీఆర్ఎస్ జోరు పెంచుతోంది. ఒకవైపు అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ అండ్ కో ద్వారా ఎన్నికల ప్రచారం చేయిస్తునే మరోవైపు సామాజిక వర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. వివిధ సామాజిక వర్గాల్లో పట్టున్న నేతలు, వ్యక్తులతో కీలకమైన భేటీలు జరుపుతోంది. హుజూరాబాద్ పరిధిలో ఎన్నికల నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. దాంతో వేరే దారి లేక హుజూరాబాద్ నియోజకవర్గానికి ఆనుకుని ఉండే హనుమకొండ జిల్లాలో సామాజిక వర్గాలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.

హనుమకొండ జిల్లాలోని పెంచికల్ పేట లో ఆత్మీయ సమావేశాల జోరును టీఆర్ఎస్ పెంచింది. టీఆర్ఎస్ పార్టీ తరపున మంత్రి హరీష్ రావు, ప్లానింగ్ కమిషన్ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్, మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్+విప్ బాల్క సుమన్, ఎంఎల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి లాంటివాళ్ళు ఆత్మీయ సమావేశాలను పర్యవేక్షిస్తున్నారు. ఎన్నికలు ఈనెల 30వ తేదీన కాబట్టి సమావేశాలను అధికార పార్టీ నింపాదిగా జరుపుతోంది.

హుజూరాబాద్ లో కులాలవారీగా ఎవరి జనాభా ఎంత ? వీరిలో పట్టున్న నేతలెవరు ? వ్యక్తులెవరు అన్న విషయాలను జాబితాలు వేసుకుని మరీ మంత్రులు సమావేశాలు నిర్వహిస్తున్నారు. సామాజిక వర్గాలకు అవసరాలేమిటి ? అలాగే సామాజిక వర్గానికి నాయకత్వం వహిస్తున్న నేతలు లేదా వ్యక్తుల అవసరాలేమిటి అనే విషయాలపైన కూడా మంత్రులు బాగా దృష్టి సారిస్తున్నారు. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఈటల రాజేందర్ ను ఎలాగైనా ఓడించడమే టార్గెట్ గా పెట్టుకున్నారు కాబట్టి మంత్రులు ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడం లేదు.

నియోజకవర్గంలో బీసీలు, ఎస్సీలు, రెడ్డి సామాజిక వర్గం ఓటర్లు చాలా ఎక్కువగా ఉన్నారు. బీసీల్లో మున్నూరు కాపు, పద్మశాలి, యదవ ఉపకులాలు ఎక్కువ. అలాగే ఎస్సీల్లో మాల, మాదిగ సామాజికవర్గాలతో పాటు రెడ్డి సామాజికవర్గంలో ప్రముఖులతో టీఆర్ఎస్ ముఖ్య నేతలు రెగ్యులర్ గా టచ్ లో ఉన్నారు. ఏ సామాజిక వర్గానికి అవసరమైన వాటిని గుర్తించటంతో పాటు ఆకాశమే హద్దుగా హామీలను ఇచ్చేస్తున్నారు మంత్రులు. మరి చివరకు అన్నీ సామాజిక వర్గాలు కలిసి టీఆర్ఎస్ అభ్యర్ధిని ఏమి చేస్తాయో అర్థం కాకుండా ఉంది.


Tags:    

Similar News