తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ - ఆయన తనయుడు కేటీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్ విరుచుకుపడ్డారు. తండ్రి - కొడుకులు అభివృద్ధి కంటే ప్రకటనల కంటే ప్రాధాన్యం ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ రోడ్లపై ఎక్కడైనా ఒక్క గుంత కనబడితే లక్ష రూపాయాలు ఇస్తామన్న మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆ సవాల్ కు కనుక కట్టుబడి ఉంటే..తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ మొత్తం కూడా సరిపోదని ఎద్దేవా చేశారు. మహా నగరంలో రోడ్లన్నీ అంత అధ్వాన్నంగా తయారయ్యాయని అన్నారు. సికింద్రాబాద్ తుకారం గేట్ వద్ద రోడ్డు అండర్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన దీక్షలో పాల్గొన్న సందర్భంగా డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడారు. రోడ్డు అండర్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం కేంద్రం 15 కోట్లు ఇచ్చినా.. రాష్ట్రం ఇవ్వాల్సిన నిధులను ఇవ్వకుండా జాప్యం చేస్తోందని డాక్టర్ లక్ష్మణ్ ఆరోపించారు.
మంత్రి కేటీఆర్ గాలి మోటర్లలో తిరుగుతూ.. గాల్లో తేలియాడుతున్నారని డాక్టర్ లక్ష్మణ్ విమర్శించారు. ఆయనకు తోడు మజ్లిస్ పార్టీ నేతలు పొగడ్తలతో ముంచెత్తుతూ అసలు విషయాలు తెలియకుండా చేస్తున్నారని ఆరోపించారు. మజ్లిస్ పార్టీ - టీఆర్ ఎస్ పార్టీ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాయని ఆరోపించారు. హైదరాబాద్ అభివృద్ధి చెందితే తమ రాజకీయ జీవితం ఉండదన్నఉద్దేశంతో పాతబస్తీలో మెట్రో లైనును అసదుద్దీన్ ఓవైసీ అడ్డుకుంటున్నారని విమర్శించారు. హైదరాబాద్ ను శాసిస్తోంది మజ్లిస్ పార్టీ అని - హైదరాబాద్ లో ఆ పార్టీ చెప్పిందే చెల్లుబాటు అవుతోందని డాక్టర్ లక్ష్మణ్ దుయ్యబట్టారు. హుస్సేన్ సాగర్ జలాలను శుద్ధి చేస్తామని చెప్పిన సీఎం...నాలుగేళ్లు కావస్తున్నా దాని గురించి పట్టించుకోవడం లేదని - సాగర్ మురుగు నీటితో లోతట్టు ప్రాంతాలైన ముషీరాబాద్ - అంబర్ పేట వంట ప్రాంతాల ప్రజలు తీవ్ర అనారోగ్యం బారిన పడుతున్నారని డాక్టర్ లక్ష్మన్ ఆవేదన చెందారు. ఇంత జరుగుతున్నా మునిసిపల్ మంత్రికి సోయి లేదని - ముఖ్యమంత్రికి పట్టింపు లేదని డాక్టర్ లక్ష్మన్ తీవ్రంగా విమర్శించారు.
హైదరాబాద్ ను డల్లాస్ - సింగపూర్ గా మారుస్తామన్నారని, డల్లాస్ - సింగపూర్ లు దేవుడెరుగు.. కనీసం ఉండేందుకు ఇళ్లు కూడా ఇవ్వడం లేదని రాష్ట సర్కార్ పై లక్ష్మణ్ మండిపడ్డారు. ఎంఎంటీఎస్ ను యాదాద్రి వరకు పొడిగిస్తామని చెప్పారని - కానీ అందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. మెట్రో విస్తరణ కోసం కేంద్రం నిధులుచ్చినా రాష్ట్రం తన వాటా ఇవ్వడం లేదన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులను నిర్దేశిత పనులకు ఖర్చు చేయకుండా వాటిని పక్కదారి పట్టిస్తున్నారన్నారు. ఈ నాలుగేళ్లలో రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచిందని - తలకు మించిన భారాన్ని తెలంగాణ ప్రజలపై మోపడం ఎంతవరకు సమంజసమని డాక్టర్ లక్ష్మన్ ప్రశ్నించారు. తుకారం గేటు రోడ్డు అండర్ బ్రిడ్జ్ సాధించేవరకు బిజెపి ఉద్యమాన్ని ఆపేది లేదని - వెంటనే రోడ్డు అండర్ బ్రిడ్జ్ ను నిర్మాణాన్ని చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ ప్రజానీకానికి బిజెపి అండగా నిలుస్తుందని, అండర్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టకపోతే ఈ ప్రభుత్వాన్ని స్తంభింపచేస్తామని డాక్టర్ లక్ష్మన్ హెచ్చరించారు.