నేతల మధ్య తిట్లు.. అధినేతలేమో ముచ్చట్లు

Update: 2015-10-19 06:25 GMT
రెగ్యులర్ గా కనిపించే పొలిటికల్ సీన్ కు భిన్నమైన పరిస్థితులు ఈ ఆదివారం చోటు చేసుకున్నాయి. రాజకీయాలన్నాక విమర్శలు.. ఆరోపణలు మామూలు. రక్తం ఉడికించేలా మాటల తూటాలు విసుక్కోవడం నేతలకు మామూలే. ఇందుకు ఈ ఆదివారం సైతం మినహాయింపేమీ కాదు. కానీ.. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. నేతల స్థాయిలో మాటలు తూటాల్లా పేలితే.. అదే పార్టీలకు చెందిన అధినేతల మధ్య మాత్రం తమ రాజకీయ వైరాల్ని పక్కన పెట్టి మరీ ముచ్చట్లు పెట్టుకున్న పరిస్థితి.

ఆదివారం ఉదయం హైదారబాద్ లో ఏర్పటు చేసిన కార్యక్రమంలో టీటీడీపీ నేతలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిపై విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రిపై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. అన్నదాతను ఆదుకోని పక్షంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను పాంహౌస్ లోనే రాజకీయ సమాధి చేస్తామన్న తీవ్ర వ్యాఖ్యల్నే చేశారు. గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి పార్టీని మరింత బలోపేతం చేసే పనిలో భాగంగా గ్రేటర్ పార్టీ పగ్గాల్ని ఎమ్మెల్యే మాగుంట గోపీనాథ్ రెడ్డికి అప్పగించిన సందర్భంగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన తెలుగు తమ్ముళ్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అదే రీతిలో తెలంగాణ రాష్ట్ర అధికారపక్ష నేతలు సైతం తమ్ముళ్లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మరింత వాడీవేడిగా ఇరు పార్టీ నేతల మధ్య వ్యాఖ్యలు చోటు చేసుకుంటే.. సాయంత్రం అయ్యేసరికి ఏపీ ముఖ్యమంత్రి.. తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షులు చంద్రబాబు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు.

కలిసింది.. అమరావతి శంకుస్థాపనకు ఇన్విటేషన్ ఇచ్చేందుకే అయినా.. వీరిద్దరి మధ్య జరిగిన 20 నిమిషాలకు పైగా సాగిన ఏకాంత భేటీతో.. వీరి మధ్య చాలానే మాటలు నడిచాయన్న భావన వ్యక్తమవుతోంది. ఒకపక్క తెలంగాణలో పార్టీ పట్టు పెంచుకునేందుకు టీటీడీపీ తమ్ముళ్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతుంటే.. మరోవైపు రెండు పార్టీల అధినేతలు మాత్రం కులాసాగా ముచ్చట్లు చెప్పుకోవటం గమనార్హం.
Tags:    

Similar News