గెలుపు జోష్ః మూడునెల‌ల్లో స‌ర్కారు ప‌త‌నం

Update: 2017-12-24 07:02 GMT
త‌మిళ‌నాడు దివంగ‌త సీఎం జ‌య‌ల‌లిత ప్రాతినిధ్యం వ‌హించిన ఆర్కే నగర్ ఉపఎన్నిక ఫ‌లితాలు ఆస‌క్తిక‌ర‌మైన ట్విస్ట్‌ ల‌తో సాగుతున్నాయి. చెన్నైలోని క్వీన్ మేరిస్ కళాశాలలో జరుగుతున్న ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. మొత్తం 19 రౌండ్లలో లెక్కింపు జరగనుంది. ఈ మధ్యాహ్నానికి ఫలితాలు వెల్లడి కానున్నాయి. అధికార అన్నాడీఎంకే తరపున మధుసూదనన్ - శశికళ వర్గం తరపున దినకరన్ - డీఎంకే నుంచి మరుదు గణేశన్ - బీజేపీ నుంచి కరు నాగరాజన్‌ తో పాటు మొత్తం 59 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

ఇప్ప‌టివ‌ర‌కు వెలువ‌డిన ఫ‌లితాల్లో శశికళ వర్గం అభ్యర్థి టీటీవీ దినకనర్ దాదాపు ప‌దివేల‌కు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఆర్కే నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో విజయం దిశగా దూసుకుపోతున్న సంద‌ర్భంగా తన నివాసం వద్ద దిన‌క‌ర‌న్‌ విలేకరులతో మాట్లాడారు. ఫలితం ఇలాగే ఉంటుందని తాను మొదటి నుంచీ చెబుతూ వస్తున్నానని అన్నారు. ఆర్కేనగర్ తీర్పే తమిళ ప్రజల తీర్పు అని ఆయన అన్నారు.  రాష్ట్రంలో అధికారంలో ఉన్న పళనిస్వామి సర్కార్ మూడు నెలలలో పతనం కావడం ఖాయమని దినకరన్ సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల విజయం సాధించాలంటే  గుర్తు ముఖ్యం కాదనీ, ప్రజల విశ్వాసం చూరగొనడం ముఖ్యమని అన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు జయలలిత సమాధి వద్ద ఆమెకు నివాళులర్పించనున్నట్లు తెలిపారు.

ఇదిలాఉండ‌గా ఉద‌యం కొద్దిసేపు ఆర్కేనగర్ ఉపఎన్నిక కౌంటింగ్ తాత్కాలికంగా నిలిచిపోయింది. అధికారులు - దినకరన్ వర్గీయులపై అధికార ఏఐడీఎంకే కార్యకర్తలు కూర్చీలు విసురుతూ దాడికి పాల్పడ్డారు. దీంతో కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పారామిలటరీ బలగాలు రంగంలోకి దిగాయి. కౌంటింగ్ కేంద్రం వద్దకు చేరుకున్న అదనపు బలగాలు ఆందోళనకారులను బయటకు పంపించారు. మ‌రోవైపు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచీ శశికళ వర్గం అభ్యర్థి దినకరన్ ఆధిక్యత కనబరుస్తుండటంతో ఆయన నివాసం వద్ద కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు.

కాగా, ఆర్కే నగర్ ఉప ఎన్నికలో శశికళ వర్గం అభ్యర్థి టీటీవీ దినకరన్ విజయం సాధిస్తారని తాను ముందే ఊహించానని బీజేపీ సీనియర్ నాయకుడు - రాజ్యసభసభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి అన్నారు. ఈ మేరకు ఆయన కొద్ది సేపటి  కిందట చేసిన ట్వీట్ లో ఆర్కేనగర్ ఉప ఎన్నికలో దినకరన్ గెలిచే అవకాశం ఉందని గతంలోనే తాను చెప్పినట్లు పేర్కొన్నారు.
Tags:    

Similar News