బీజేపీ సీనియర్ మరొకరు పోటీకి నో!

Update: 2019-04-06 19:01 GMT
ఈ ఎన్నికల రణరంగం నుంచి మరో బీజేపీ సీనియర్ తప్పుకున్నారు! ఇప్పటికే అద్వానీ, మురళీ మనోహర్ జోషి వంటి వాళ్లను కమలం పార్టీ పక్కన పెట్టినట్టుగా అగుపిస్తోంది. వయసు మీద పడిన వాళ్లు ఈ ఎన్నికల్లో పోటీ చేసినా కీలకమైన పదవులు ఏవీ దక్కవని వారు ఎంచక్కా తప్పుకోవాలన్నట్టుగా వారిని షా, మోడీలు పక్కన పెట్టారనే అభిప్రాయాలున్నాయి.

ఒక తను ఎన్నికల్లో పోటీ చేయడం లేదని లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కూడా ప్రకటించేశారు. ఆమె కూడా డెబ్బై ఐదేళ్ల వయసుకు చేరువ కావడంతో ఆమెకు టికెట్ ఇవ్వడంలో మోడీ, షాలు సంశయించారట. ఇక పరిస్థితి అర్థం చేసుకుని ఆమె పోటీకి దూరం అని ప్రకటించుకున్నారనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి.

ఇప్పుడు వారితో చేతులు కలిపారు మరో సీనియర్ నేత ఉమాభారతి. తను ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఆమె ప్రకటించారు. మధ్యప్రదేశ్ లోని ఝాన్సీ నియోజకవర్గం నుంచి ఉమాభారతి ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. గత ఎన్నికల అనంతరం మోడీ ప్రభుత్వం ఏర్పడ్డాకా ఉమాభారతి కి బాగానే ప్రాధాన్యతను ఇచ్చారు. కీలకమైన గంగా నది శుద్ధి బాధ్యతలు ఆమెవే అన్నారు.

ఇప్పుడు ఉమాభారతి మాట్లాడుతూ.. ఇక తను పూర్తిగా గంగానదికే అంకితం అని, తను గంగ వద్దనే గడపబోతున్నట్టుగా ప్రకటన చేశారు. అందుకే ఎన్నికల్లో కూడా పోటీ చేయడం లేదని..తన స్థానంలో మరొకరిని ఝాన్సీ నుంచి పోటీ చేయించాలని పార్టీకి కూడా స్పష్టత ఇచ్చారట. ఇలా ఈ ఎన్నికల్లో పోటీకి మరో సీనియర్ నేత నో చెప్పేసినట్టే!


Tags:    

Similar News