శభాష్ మంత్రిగారు: నోట్లను ఎలుకలు కొరికాయని ఏడుస్తున్న వృద్దుడుకి అనూహ్య ఓదార్పు

Update: 2021-07-18 11:32 GMT
అనుకోని కష్టం విరుచుకుపడినప్పుడు ఎదురయ్యే ఇబ్బంది అంతా ఇంతా కాదు. అందులోకి పెద్ద వయసులో ఉన్నప్పుడు వచ్చే కష్టాల్ని ఎదుర్కోవటం అంత తేలికైన విషయం కాదు. అలాంటి సమస్యే ఎదురైనప్పుడు అనూహ్యంగా తెలంగాణ రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ స్పందించిన తీరు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. మీడియాలో కథనాల్ని చూసినంతనే స్పందించటమే కాదు.. పేద రైతు కమ్ వ్యాపారి ఆరోగ్య సమస్యకు ఆమె ఇచ్చిన ధీమా అతడిలో వేదనను తొలిగించిందని చెప్పాలి. మహబూబాబాద్ జిల్లా వేంనూరు శివారు ఇందిరా నగర్ కాలనీ తండాకు చెందిన భూక్య రెడ్యా అనే రైతు కమ్ కూరగాయల వ్యాపారి కడుపులో కణితి వచ్చింది.

దీంతో.. ఆసుపత్రికి వెళ్లిన ఆయనకు శస్త్రచికిత్స అవసరమని వైద్యులు తేల్చారు. కూరగాయల వ్యాపారం చేసే ఆయన.. తాను కష్టపడి సంపాదించి కూడబెట్టిన డబ్బులతో సర్జరీ చేయించుకోవాలని భావించారు. అతడి ఆరోగ్య సమస్యను పరిశీలించిన వైద్యుడు రూ.4లక్షల ఖర్చు అవుతుందని చెప్పారు. దీంతో.. తాను కూడబెట్టిన రూ.2లక్షలకు.. అప్పుగా మరో రూ.2లక్షల మొత్తాన్ని తీసుకొచ్చి ఇంట్లోని బీరువాలో దాచారు.

ఈ సమయంలోనూ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఇంట్లోని బీరువాలో ఉంచిన కరెన్సీ నోట్లను ఎలుకలు కొరికేశాయి. ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవటానికి వెళ్లేందుకు బీరువా తీసిన భూక్య రెడ్యాకు షాక్ తగిలింది. ఏం చేయాలో అర్థం కాలేదు. నోట్ల కట్టల స్థానే.. చిరిగిపోయిన నోట్ల దొంతరులు దర్శనమిచ్చాయి. దీంతో.. ఏం చేయాలో తోచని పరిస్థితి నెలకొంది. దీంతో.. చిరిగిన నోట్లను తీసుకొని జిల్లా కేంద్రంలోని బ్యాంకుల వద్దకు వెళ్లి.. జరిగిన విషయాన్నిచెప్పినా.. వాటిని తీసుకొని మంచి నోట్లు ఇవ్వటానికి బ్యాంకు అధికారులు ముందుకు రాలేదు. దీంతో.. ఊసురుమన్న అతని ఉదంతం గురించి తెలిసిన మీడియా ప్రతినిధులు అతని వేదనను వార్తలుగా ఇచ్చారు.

మరోవైపు.. ఎలుకల కారణంగా చిరిగిన నోట్లను తీసుకొని హైదరాబాద్ లోని రిజర్వు బ్యాంకు కు వెళ్లాలన్న సూచనను చేశారు. అయితే.. అంత కష్టపడి హైదరాబాద్ వెళ్లినా.. అక్కడి రిజర్వు బ్యాంకు అధికారులు మంచి నోట్లను ఇచ్చేందుకు ఒప్పుకుంటారో లేదో తెలీని పరిస్థితి. దీంతో.. దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. దీంతో భోరున విలపించారు. ఇలాంటి వేళ.. మీడియాలో వచ్చిన వార్తల్ని చూసిన మంత్రి సత్యవతి రాథోడ్ స్పందించారు. సదరు రైతుకు మెరుగైన వైద్యం.. డబ్బులు ఇస్తామని హామీ ఇచ్చారు. ఏమైనా.. కష్టంలోని రైతు వేదనకు వెంటనే స్పందించిన సత్యవతి రాథోడ్ ను పలువురు అభినందిస్తున్నారు.
Tags:    

Similar News