ఉప్పు నీటికోసం అమెరికా - చైనా పంచాయితీ..!

Update: 2021-03-20 15:30 GMT
మ‌నిషి మొద‌టి పోరాటం ఆక‌లి తీర్చుకోవ‌డానికి.. చివ‌రి ఆరాటం ఆధిప‌త్యం చాటుకోవ‌డానికి! స‌గ‌టు వ్య‌క్తి నుంచి.. సామ్రాజ్య దేశాల వ‌ర‌కూ ఇదే విధానం కొన‌సాగుతోంది. చ‌రిత్ర త‌వ్వినా.. వ‌ర్త‌మానం ప‌రిశీలించినా.. భ‌విష్య‌త్ ను అంచ‌నా వేసినా.. ఇదే క‌నిపిస్తుంది. అంతిమ ల‌క్ష్యం ఆధిప‌త్య‌మే! నిన్న‌టి వ‌ర‌కూ ప్ర‌పంచ పెద్ద‌న్న ఎవ‌రంటే అమెరికా అని ముక్త‌కంఠంతో స‌మాధానం వ‌చ్చేది. కానీ.. ఇప్పుడు ప‌రిస్థితి మారిపోయింది.

ప్ర‌పంచంలో చైనా ప్ర‌బ‌ల ఆర్థిక శ‌క్తిగా ఎదుగుతోంది. దాని దూకుడుకు అమెరికా కుర్చీ క‌దిలిపోయేలా ఉంది. ఆల్రెడీ ఆధిప‌త్యం చెలాయిస్తున్న‌వారు.. దిగిపోవ‌డానికి స‌హ‌జంగానే సిద్ధంగా ఉండ‌రు కాబ‌ట్టి.. అనివార్యంగా అమెరికా - చైనా మ‌ధ్య వార్ కొన‌సాగుతోంది. ఈ ప్ర‌చ్ఛ‌న్న యుద్ధాన్ని మ‌నం ప్ర‌తీ విష‌యంలోనూ గ‌మ‌నించొచ్చు. ద‌క్షిణ చైనా స‌ముద్ర జ‌లాల వివాద‌మే ఇందుకు ఉదాహ‌ర‌ణ‌.

ఏ దేశ స‌రిహ‌ద్దులో ఉన్న స‌ముద్ర తీరం మీద ఆ దేశానికి కొంత హ‌క్కు ఉంటుంది. ఆ విధంగా ద‌క్షిణ చైనా తీరం మీద చైనా హ‌క్కు ఉంది. కానీ.. చైనా ఆశ‌లు తీరం దాటుతున్నాయి. న‌డి స‌ముద్రం దాకా నాదే అంటోంది. మ‌ధ్య‌లో ఉన్న దీవుల‌న్నీ నా సోంత‌మే అంటోంది. త‌ద్వారా.. త‌న బ‌లాన్ని చాటిచెప్పాల‌నుకునే ఆరాటం త‌ప్ప‌, మ‌రొక‌టి కాద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

మ‌లేషియా, బ్రూనై, తైవాన్ వంటి దేశాలు ఈ స‌ముద్ర జ‌లాల్లో త‌మ‌కూ వాటా ఉంద‌ని వాదిస్తున్నాయి. ఇవేకాకుండా.. పిలిప్పీన్స్‌, వియాత్నం కూడా మ‌రి, మా సంగ‌తేంటీ అని అడుగుతున్నాయి. ఈ ప్రాంతానికి ఇంత‌గా డిమాండ్ రావ‌డానికి కార‌ణం ఏమంటే.. స‌ముద్రంలో ప్ర‌పంచ వ్యాప్తంగా జ‌రిగే వ్యాపార లావాదేవీల్లో ఇక్క‌డే ఎక్కువ‌గా జ‌రుగుతుంది. అందుకే.. అంద‌రూ ఇది మా ప్రాంతం అంటున్నారు. దీనికి.. అప్పుడెప్పుడో 1947లోనే ఓ మ్యాప్ విడుద‌ల చేసింది చైనా. ఆ ప్ర‌కారం ద‌క్షిణ చైనా స‌ముద్ర జ‌లాల్లోని 90 శాతం ప్రాంతం త‌మ‌దేన‌ని ప్ర‌క‌టించుకుంటోంది. దీన్ని తాము అంగీక‌రించే ప్ర‌స‌క్తే లేదంటున్నాయి ఆయా దేశాలు.

అయితే.. ఎక్క‌డో ఉన్న అమెరికా ఈ పంచాయితీలో పెద్ద‌న్న‌గా రావ‌డం గ‌మ‌నించాల్సిన అంశం. త‌న ఆధిప‌త్యం కాపాడుకోవ‌డానికే అమెరికా ఇలా వ‌స్తోందంటున్నారు విశ్లేష‌కులు. చైనా తీరం పోగా.. మిగిలిన స‌ముద్రం మొత్తం అంత‌ర్జాతీయ జ‌లాలే అంటోంది యూఎస్‌. ఇప్పుడు బైడెన్ వ‌చ్చిన త‌ర్వాత‌.. మ‌ళ్లీ ఈ విష‌యం వేడెక్కింది. త‌ర‌చూ అమెరికా విమానాలు, నౌక‌లు ఆ ప్రాంతాల్లోకి వెళ్లి వ‌స్తున్నాయి. అంతేకాదు.. చైనా ఆధిప‌త్యం పెర‌గ‌కుండా.. భార‌త్‌, జ‌పాన్‌, ఆస్ట్రేలియాల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతోంది.

మొత్తంగా.. రెండు పెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల మ‌ధ్య జ‌రుగుతున్న అంత‌ర్గ‌త వార్ తో.. ద‌క్షిణ చైనా స‌ముద్ర జ‌లాల వ్య‌వ‌హారం రోజురోజుకూ జ‌ఠిలంగా మారుతోంది. రెండు దేశాల సైనిక ఘ‌ర్ష‌ణ‌కూ కార‌ణం అవుతోంది. మ‌రి, ఈ స‌మ‌స్య ఎప్పుడు ప‌రిష్కారం అవుతుందో చూడాలి.
Tags:    

Similar News