మాట సాయం అడిగితే చెల్లించక తప్పదు భారీ మూల్యం!

Update: 2019-08-23 05:23 GMT
అమెరికాతో పెట్టుకోవద్దని ఊరికే అనరు. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో.. మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం లాంటి సామెతలు పెద్దన్న దగ్గర నడవ్వు. ప్రపంచానికి పెద్దన్న పోస్టులో ఉన్నప్పుడు ప్రపంచం మొత్తం తన దయతో బతికేస్తుందని ఫీలయ్యే అమెరికా అధ్యక్షులకు ట్రంప్ లాంటోడే అధ్యక్షుడైతే.. వ్యవహారం మరెంతలా ఉంటుందో మాటల్లో చెప్పే కన్నా.. మనసులో ఊహించేసుకుంటే చాలాబాగా అర్థమైపోతుంది.

ఎవరి సాయామైనా ఇట్టే తీసేసుకునే అమెరికా.. తాను మాత్రం సాయం చేయాలన్నా.. మాట సాయంగా ఉండాలన్నా అందుకు భారీ మూల్యాన్ని చెల్లించేలా చేయటం అమెరికాకు అలవాటు. ఒక రకంగా చెప్పాలంటే అమెరికా అన్నది ప్రజల రక్తాన్ని పీల్చేసే మీటరు వడ్డీ వసూలు చేసే కరడుగట్టిన వడ్డీ వ్యాపారి లాంటోడు. మీకు ఎంత కష్టమన్నది అతనికి అనవసరం. అతని వద్దకు వెళ్లి.. అయ్యా.. కష్టం వచ్చింది.. కాస్త డబ్బు సాయం చేయడన్నంతనే.. మీకున్న ఆర్థిక స్థితిగతుల్ని లెక్క కట్టి.. మీ అవసరం స్థాయిని అర్థం చేసుకొని.. ఎవరి దగ్గరా అప్పు పుట్టక తన వద్దకు వచ్చాడా?  ఇంకే కారణం మీద వచ్చాడన్న విషయాల్ని కాల్యుకులేట్ చేసి.. అందుకు తగ్గట్లు వడ్డీ రేట్లను అవసరానికి తగ్గట్లు మార్చేసే అలవాటున్న వడ్డీ వ్యాపారిలా వ్యవహరిస్తుంది అమెరికా.

అందుకే.. భారత్ లాంటి దేశం అమెరికాను అదే పనిగా రాసుకుపూసుకోదు. అలా అని దూరంగా ఉండదు. మన అవసరాలకు తగ్గట్లు అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తూ తెలివిగా వ్యవహరిస్తుంది. ఇన్నేళ్లు అయిన తర్వాత కూడా అమెరికాతో స్నేహం చేసి.. బెస్ట్ ఫ్రెండ్ గా మారిపోవచ్చు కదా? అని చాలామంది ఉచిత సలహా ఇచ్చి పారేస్తారు కానీ.. అమెరికా గురించి.. అమెరికా తీరు గురించి బాగా తెలిసిన వారు మాత్రం ఆ దేశంతో ఎంతవరకో అంతవరకున్నట్లుగా ఉంటారు.

అమెరికాలో డీల్ ఏదైనా సరే.. దాని ప్రయోజనాల గురించి ఆలోచిస్తుందే తప్పించి.. తనతో డీల్ చేసుకునే వాడి ప్రయోజనాల్ని అస్సలు పరిగణలోకి తీసుకోంది. అంత కమర్షియల్ గా ఆలోచించే తత్త్వం ఉండబట్టే.. అది ప్రపంచానికి పెద్దన్న అయ్యిందన్న విషయాన్ని మర్చిపోకూడదు.

మరి.. ఇలాంటి విషయాలు మోడీ మాష్టారికి తెలుసో తెలీదో.. లేదంటే తన మీదా.. తన మేథస్సు మీద ఉన్న నమ్మకమో కానీ.. ఎంతమేరకు అమెరికాను వాడుకోవాలో.. ఏ విషయాల్లో ఎంతవరకూ అమెరికాకు అవకాశం ఇవ్వాలన్న దానిపై దశాబ్దాల తరబడి వ్యవహరించిన భారత పాలకుల తీరుకు భిన్నంగా వ్యవహరించారు మోడీ. అంతే.. మాట సాయం చేసినట్లుగా చేసిన ట్రంప్.. అమెరికా అధ్యక్షులకు ఉండే సగటు వ్యాపార కాంక్షను రోజుల్లోనే బయటపెట్టేశారు.

కశ్మీర్ ఇష్యూలో తాను తీసుకున్న నిర్ణయాలపై దాయాది అదేపనిగా కుళ్లుకోవటం.. ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అంతర్జాతీయ వేదికల మీద ఈ ఇష్యూను తీసుకొస్తూ రచ్చ చేయాలన్న పట్టుదలతో ఉన్న వేళ.. మోడీ మాష్టారు ఇమ్రాన్ కు మాస్టర్ స్ట్రోక్ ఇవ్వాలన్న ఆలోచనతో సీన్లోకి ట్రంప్ సారును దించేశారు.

తనకు తానే ట్రంప్ వారికి ఫోన్ చేసి.. ఆ ఇమ్రాన్ ఖాన్ సంగతి చూడండి.. అదే పనిగా నోరు పారేసుకున్నాడని మాట సాయాన్ని అడిగేశారు. ఇలాంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్న ట్రంప్.. మోడీ ఫోన్ కాల్ పూర్తి అయిన గంటల వ్యవధిలోనే ఇమ్రాన్ కు ఫోన్ కలిపేశారు. భారత్ విషయంలోనూ.. కశ్మీర్ విషయంలో నోరెత్తమాకు అన్న రీతిలో సందేశాన్ని ఇచ్చినట్లుగా అమెరికా ఒక ప్రకటన ఇచ్చిపారేసింది. దీంతో తెగ సంబరపడిపోయింది మోడీ పరివారం.

ఇక్కడితో విషయం అయిపోతే.. మనం మాట్లాడుకోవాల్సింది ఏముంది? ఇక్కడే మొదలైంది అసలు కథ. మోడీ అడిగిన మాట సాయానికి రెండు రోజుల వ్యవధిలోనే భారీ షాకిచ్చేలా ఒక వ్యాఖ్య చేశారు ట్రంప్ వారు. అఫ్గాన్ లో తాలిబన్లపై తాము చేస్తున్న పోరాటంలో భారత్ కలిసి రావాలంటూ కొత్త మెలిక పెట్టారు. అఫ్గాన్ కు 7వేల మైళ్ల దూరంలో ఉన్న అమెరికా ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడుతుంటే.. పక్కనే ఉన్న భారత్ పోరాడటం లేదని.. పాక్ చాలా కొద్దిగా కృషి చేస్తుందంటూ కొత్త ముద్ర భారత్ మీద వేసేశాడు.

అంతేనా.. ఇలాంటి తీరు సరికాదని.. ఉగ్రవాదుల మీద తాము చేసే పోరాటానికి భారత్ తో పాటు ఇరాక్.. ఇరాన్.. రష్యా.. టర్కీ లాంటి దేశాలు కలిసి రావాలని సెలవిచ్చారు. అంతా వచ్చి అఫ్గాన్ లోని ఉగ్రవాదుల మీద యుద్ధం చేస్తే.. తానిప్పటికే ఈ అంశంలో జోక్యం చేసుకోవటం ద్వారా పడిన ఆర్థిక భారం నుంచి బయటపడాలని భావిస్తున్నట్లుగా ఉంది.

ట్రంప్ వారి తాజా వ్యాఖ్యకు మోడీ మాస్టారు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. పెద్దన్నను మాటసాయం కోరినా అందుకు భారీ మూల్యం చెల్లించాలన్న నిజం ఇప్పటికైనా అర్థమైతే మంచిది. మోడీ మాష్టారు అర్థం చేసుకుంటారంటారా?
Tags:    

Similar News