కొరియా క‌న్నెర్ర చేస్తే.. అమెరికా స్మాషేనా?

Update: 2017-08-23 09:09 GMT
అవును! ఈ వ్యాఖ్య‌లు అక్ష‌ర స‌త్యాల‌ని తెలుస్తోంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు క్షిప‌ణుల‌ను ప్ర‌యోగించి అమెరికా అంతుచూస్తాన‌ని, ఆ దేశం గుండెల్లో నిద్ర‌పోతాన‌ని వెల్ల‌డించిన ఉత్త‌ర కొరియా మాట‌ల‌ను పైకి ఎవ‌రూ విశ్వ‌సించ‌లేదు. ముఖ్యంగా అమెరికా కూడా పెద్దగా లెక్క చేయ‌లేదు. అస‌లు మేం క‌నుక త‌లుచుకుంటే నువ్వెంత‌? అనే రేంజ్‌ లో అమెరికా అధిప‌తి ట్రంప్ రెచ్చిపోయారు. కానీ, ఇప్పుడు ప‌రిస్థితి యూట‌ర్న్ తీసుకుంది. కొరియా ద‌గ్గ‌ర క్షిప‌ణులేకాదు.. అంత‌కు మించి జ‌న హ‌న‌న ఆయుధాలు విప‌రీతంగా ఉన్నాయ‌ని, అమెరికా త‌ల‌వంచ‌క త‌ప్ప‌ద‌ని తెలిపే ఓ నివేదిక వెలుగు చూసింది.

విష‌యంలోకి వెళ్తే..  ఉత్త‌ర‌కొరియా - అమెరికా యుద్ధ ప్ర‌క‌ట‌న‌పై ఐక్యరాజ్యసమితి దృష్టి పెట్టింది. అస‌లు  రెండు దేశాలూ త‌ల‌ప‌డితే ప‌రిస్థితి ఏంటి అని అధ్య‌య‌నం చేసింది. ఈ క్ర‌మంలోనే అనేక భ‌యంక‌ర నిజాలు వెలుగు చూశాయి. ఉత్తర కొరియా రసాయన ఆయుధాలను తయారు చేసుకుంద‌ని,  ఉత్తర కొరియా ఎగుమతులపై ఐక్యరాజ్యసమితి అంక్షలు విధించిన అనంతరం సిరియా నుంచి ఆ దేశం రెండు పడవల్లో రసాయన దాడులకు అవసరమైన సామాగ్రిని దిగుమతి చేసుకుందని ఐక్య‌రాజ్య‌స‌మితి గుర్తించింది.

దీనికి సంబంధించి..  ఐక్యరాజ్యసమితి అంతరంగిక భద్రతా మండలి దాదాపు 37 పేజీల‌తో కూడా ఓ అతిర‌హ‌స్య‌మైన నివేదికను త‌యారు చేసింది. కొరియా ర‌సాయ‌న దాడుల‌కు సంబంధించి  తగిన ఆధారాలను ఐక్య‌రాజ్య‌స‌మితి సంపాయించింది.  వాటిని కూడా ఈ నివేదిక‌లో పొందుప‌రిచింది.  సిరియా నుంచి ఈ రసాయనాలను ఉత్తర కొరియా మైనింగ్ డెవలప్‌ మెంట్ కార్పొరేషన్ పేరుతో రప్పించుకుందని తెలిపింది. ఈ ఆయుధాల‌ను ప్ర‌యోగిస్తే.. జ‌న హ‌న‌నంతో పాటు కొన్ని ద‌శాబ్దాల పాటు ..ఈ ర‌సాయన ఆయుధాలు ప్ర‌యోగించిన ప్రాంతాలు నివాసానికి - పంట‌ల‌కు స‌హా దేనికీ ప‌నికి రాకుండా పోతాయ‌ని హెచ్చ‌రించింది. దీంతో ఈ  నివేదిక అమెరికా గుండెల్లో గుబులు రేపుతోంది.  మ‌రి ఉత్త‌ర కొరియా నిజంగానే అమెరికాపై ఈ ర‌సాయ‌న బాంబుల‌తో విరుచుకుప‌డుతుందా?  అమెరికాను స్మాష్ చేస్తుందా అన్న‌ది ఇప్ప‌ట్లో చెప్ప‌లేం కానీ.. ఉత్త‌ర కొరియా గురించి భ‌యంక‌ర నిజాలు వెల్ల‌డి కావ‌డం అదికూడా ఐక్య‌రాజ్య‌స‌మితి వెల్ల‌డించ‌డాన్ని బ‌ట్టి న‌మ్మ‌కుండా ఉండ‌లేదు.
Tags:    

Similar News