కాంగ్రెస్‌ తో కోదండరాం సారుకు చెడిందా?

Update: 2017-02-14 05:16 GMT
తెలంగాణ‌ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం రాష్ట్ర ప్ర‌భుత్వంపై చేస్తున్న విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో టీఆర్ ఎస్ ప‌దే ప‌దే చేస్తున్న ఆరోప‌ణ‌...జేఏసీ మాస్టారి వెనుక ఉంది కాంగ్రెస్ పార్టీ అని. అయితే కాంగ్రెస్‌ కు - కోదండ‌రాంకు మ‌ధ్య అనుకున్నంత స‌ఖ్య‌త లేన‌ట్లుగా క‌నిపిస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్య‌లు ఇందుకు బ‌లం చేకూరుస్తున్నాయి. నిరుద్యోగులకు మేలు చేసేలా తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని ఆరోపిస్తూ ఈనెల 22న కోదండ‌రాం నిరుద్యోగ ర్యాలీకి సిద్ధ‌మ‌య్యారు. ఇప్ప‌టికే సోష‌ల్ మీడియా స‌హా వివిధ రూపాల్లో త‌న నిర‌స‌న‌కు మ‌ద్ద‌తివ్వాల‌ని కోరుతున్నారు. అయితే దీనిపై ఉత్త‌మ్ స్పందిస్తూ  కోదండ‌రాం తలపెట్టిన నిరుద్యోగ ర్యాలీకి మద్దతు ఇవ్వాలా? వద్దా? అనే విషయంలో ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. గాంధీభవన్‌ లో జ‌రిగిన‌ టీపీసీసీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశంలో ఆయ‌న మాట్లాడారు.

కాగా, హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్‌ నగర్ ఉపాధ్యాయ నియోజకవర్గం స్థానానికి జరుగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున అభ్యర్ధి ఎవరు కూడా పోటీ చేయడం లేదని ఉత్త‌మ్ కుమార్ రెడ్డి పార్టీ నాయ‌కుల‌ను ఉద్దేశించి ప్ర‌క‌టించారు. ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు స‌రైన అభ్య‌ర్థులు లేనందున ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వివ‌రించారు. కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలుపై టీఆర్‌ ఎస్‌ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. టీఆర్‌ ఎస్‌ ఇచ్చిన హామీలను ప్రజలకు వివరిస్తామని, వాటి అమలు అంశంలో ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యాన్ని ఎండగడుతామన్నారు. ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతామని ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ప్ర‌క‌టించారు. యువతను ఈ ప్రభుత్వం మోసం చేస్తోంద‌ని ఆరోపించారు. ప్రజా సమస్యల పరిష్కారంపై ఈ నెల 19 నుంచి 28 వరకూ ప్రతీ నియోజకవర్గంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News