ఉత్తమ్ కుమార్ రెడ్డి త్యాగానికి రెడీనట..!

Update: 2019-06-05 07:54 GMT
తనకు పీసీసీ అధ్యక్ష పదవి అక్కర్లేదని అంటున్నారట తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక  ఆ పదవిని ఖాళీ చేయడానికి రెడీ అని ఉత్తమ్ ప్రకటించారట. ఈ విషయాన్నే ఆయనే అధిష్టానానికి కూడా నివేదించబోతూ ఉన్నారట.

ప్రస్తుతం కాంగ్రెస్ హై కమాండ్ చిత్రమైన రాజకీయ పరిణామాల్లో చిక్కుకుని ఉంది. ఒకవైపు లోక్ సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ చిత్తుగా ఓడింది. మరోవైపు రాహుల్ గాంధీ రాజీనామా అంటున్నారు. ఈ అంశంలో ఏమీ తేలడం లేదు. రాహుల్ రాజీనామాను వెనక్కు తీసుకోవాలని కాంగ్రెస్ వాళ్లు ప్రాధేయ పడుతూ ఉన్నారు. అయితే ఆయన మాత్రం అందుకు నో అంటున్నారు. ఆ వ్యవహారంపై ప్రతిష్టంభన నెలకొని ఉంది.

రాహుల్ కథ ఒక కొలిక్కి వచ్చాకా రాష్ట్రాల వారీగా కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుల మీద దృష్టి పెడుతుందట. అందులో భాగంగా తెలంగాణ మీద కూడా నిర్ణయం తీసుకోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరబోతూ ఉన్నారట. తనకు పీసీసీ అధ్యక్ష పదవి వద్దని, దాన్ని వేరొకరికి ఇవ్వాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పనున్నారట.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు వరకూ ఆ రాష్ట్రంలో పీసీసీ అధ్యక్ష పదవికి గట్టి పోటీ ఉండేది. అది తమకు కావాలంటూ పలువరు నేతలు పోటీ పడ్డారు. ఇప్పుడు మాత్రం  అంత పోటీ లేదు. దాదాపు ఐదేళ్ల వరకూ ఎన్నికలు లేనట్టే కాబట్టి.. ఎవరూ ఆ పదవి విషయంలో అంతా పోటీ పడటం లేదు. ఈ నేపథ్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ పదవిని త్యాగం చేయడానికి రెడీ అంటున్నారట!


Tags:    

Similar News