పవన్‌ కల్యాణ్, బాలకృష్ణపై వల్లభనేని వంశీ సంచలన వ్యాఖ్యలు!

Update: 2022-10-17 12:19 GMT
ఆరు శాతం ఓటింగ్‌ జనసేన దాడులు చేస్తే చూశారని.. అదే 51 శాతం ఓటింగ్‌ వచ్చిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు దాడులు చేస్తే ఎలా ఉంటుందో తెలుసా అని గన్నవరం వైసీపీ అనుకూల ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్‌ కల్యాణ్‌ తన శ్రేణులను అదుపులో పెట్టుకోవాలన్నారు. మంత్రులపై దాడిని ఖండిస్తున్నానన్నారు.

టీడీపీని రక్షించుకోవడం కోసమే ఎన్టీఆర్‌ నుంచి చంద్రబాబు పార్టీని స్వాధీనం చేసుకుంటే మరి అప్పట్లో ఆ పార్టీలో ఉన్న హరికృష్ణ వేరుగా పార్టీ ఎందుకు పెట్టుకున్నారని ప్రశ్నించారు. అలాగే కొన్నాళ్లపాటు బాలకృష్ణ సైతం ఎందుకు స్తబ్దుగా ఉండారని నిలదీశారు. అదేవిధంగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన భార్య పురందేశ్వరి కూడా టీడీపీ బయటకొచ్చి వేరు వేరు పార్టీల్లో ఎందుకున్నారో చెప్పాలన్నారు.

ఎన్టీఆర్, లక్ష్మీపార్వతి కలిసికట్టుగా ప్రచారం చేసి 1994 ఎన్నికల్లో 262 సీట్లలో టీడీపీని గెలిపించారని గుర్తు చేశారు. వారిద్దరికి ప్రజల ఆశీస్సులు లభించాయన్నారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ను టీడీపీ వాడుకుని వదిలేసిందని వల్లభనేని వంశీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాను వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గన్నవరం నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీలో గ్రూపులు ఉన్నప్పటికీ వారందరినీ కలుపుకుని ముందుకు వెళ్తానని స్పష్టం చేశారు.

అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రలో రైతులు ఎవరూ లేరని వల్లభనేని వంశీ మోహన్‌ చెప్పారు. అందులో ఉన్నవారంతా పెట్టుబడిదారులేనని తెలిపారు. రైతులను బెదిరించి అసైన్డ్‌ భూములను లాక్కున్నారని చెప్పారు.

అలాగే అహా ఓటీటీలో వస్తున్న అన్‌స్టాపబుల్‌ షోపైనా వల్లభనేని వంశీ వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్‌ను పదవి నుంచి తప్పించి చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంపై చంద్రబాబు చెప్పిన అంశాలతో వంశీ విభేదించారు. ఎన్టీఆర్‌కు నాడు జరిగింది వెన్నుపోటేనన్నారు. ఎన్టీఆర్‌కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని చెప్పారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News