ఎట్ట‌కేల‌కు!... టీడీపీలోకి వంగ‌వీటి!

Update: 2019-03-12 18:01 GMT
ఎన్నిక‌ల‌కు ఆరు నెల‌ల స‌మ‌యం ఉంద‌న‌గా... అనూహ్యం నిర్ణ‌యం తీసుకున్న వైసీపీ మాజీ నేత‌, మాజీ ఎమ్మెల్యే వంగ‌వీటి రాధాకృష్ణ‌ ఎట్ట‌కేల‌కు అధికార పార్టీ టీడీపీలో చేరిపోతున్నారు. వైసీపీ రాజీనామా ప్ర‌క‌టించిన నాడే... ఆయ‌న టీడీపీలోకి చేర‌తార‌ని వార్త‌లు వినిపించినా... ఏ కార‌ణమో తెలియ‌దు గానీ... వైసీపీకి దూర‌మైన త‌ర్వాత టీడీపీలోకి ఆయ‌న ఎంట్రీకి నెల‌ల స‌మ‌య‌మే ప‌ట్టింది. వైసీపీకి రాజీనామా చేసిన సంద‌ర్భంగా త‌న తండ్రి దివంగ‌త వంగ‌వీటి రంగా హ‌త్య కేసుతో టీడీపీకి సంబంధం లేదంటూ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన రాధా... నేరుగా ఆ పార్టీలోకి చేరిపోతార‌న్న వాద‌న వినిపించింది. ఆ త‌ర్వాత టీడీపీ నేత‌లు కూడా ఆయ‌న‌తో బేటీ అయ్యారు. అయితే ఏమైందో తెలియ‌దు గానీ... రాధాకు టీడీపీలోకి ఎంట్రీ లేద‌ని కొంద‌రు, టీడీపీ వ‌ద్ద‌ని రాధానే ఓ నిర్ణ‌యం తీసుకున్నార‌ని మ‌రికొంద‌రు.. ఇలా ఎవ‌రికి ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా వారు మాట్లాడేసుకున్నారు. అయితే ఈ మాట‌ల‌పై స్పందించేందుకు మాత్రం రాధా ఆస‌క్తి చూప‌లేద‌నే చెప్పాలి.

ఈ క్ర‌మంలో రాధా పొలిటిక‌ల్ కెరీర్ ముగిసిన‌ట్టేనన్న కోణంలో కొన్ని విశ్లేష‌ణ‌లు కూడా జ‌రిగాయి. అయితే... ఆంధ్రా ఆక్టోప‌స్‌గా పేరున్న బెజ‌వాడ మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ ఎంట్రీతో ఇప్పుడు రాధాకు టీడీపీలోకి గ్రాండ్ వెల్క‌మ్ ల‌భించ‌బోతోంది. ఇప్ప‌టికే టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడితో భేటీ అయిన రాధా... టీడీపీలో చేరే ముహూర్తాన్ని కూడా ఖ‌రారు చేసుకున్నారు. బుధ‌వారం ఉద‌యం ఆయ‌న చంద్రబాబు స‌మ‌క్షంలోనే టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం సీఎం చంద్ర‌బాబుతో భేటీ అయిన రాధా... టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చే విష‌యంపై ఇన్నాళ్లుగా కొన‌సాగుతున్న స‌స్పెన్స్‌కు తెర దించార‌నే చెప్పాలి. చంద్ర‌బాబుతో భేటీ త‌ర్వాత టీడీపీలో చేరుతున్న‌ట్లుగా ప్ర‌క‌ట‌న చేసిన రాధా... ఆస‌క్తికర వ్యాఖ్య‌లు చేశారు.

టీడీపీకి తోడుగా ఉండాలని నిర్ణయించుకున్నానని ప్ర‌క‌టించిన రాధా... వంగవీటి రంగా ఆకాంక్షను చంద్రబాబు నెరవేర్చారని.. పేద ప్రజలకు శాశ్వత ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ప్రజల భవిష్యత్తు.. నియంతృత్వ వ్యక్తిత్వం కలిగి ఉన్న వ్యక్తి బారిన పడకుండా తన వంతు బాధ్యతను నిర్వహిస్తానని చెప్పిన రాధా..  పేదల కోసం నిందలు మోయడానికి సిద్ధపడి అడుగులేస్తానని చెప్పారు. మొత్తంగా నెల‌ల త‌ర‌బ‌డి స్తబ్దుగా ఉన్న రాధా.. ఎన్నిక‌ల‌కు ముందుగా టీడీపీలో చేరిపోతున్నార‌న్న‌మాట‌.


Tags:    

Similar News