చంద్రబాబుకు దెబ్బేసిన వెంకయ్య

Update: 2016-09-17 09:24 GMT
హైదరాబాద్ పేరెత్తితే చాలు శివాలెత్తిపోతారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. హైదరాబాద్ ను తానే అభివృద్ధి చేశానని... తన వల్లే ఆ నగరం ఈ స్థాయిలో ఉందని అడిగినవాడికి - అడగనివాడికి చెబుతుంటారు. ఇప్పటికి కొన్ని వేల సందర్భాల్లో ఆయన ఆ మాట చెప్పిచెప్పి జనాన్ని విసుగెత్తించారు. ఆ ఘనత అంతా తనదేనని ఆయన చెప్పుకోవడం.. కాదుకాదంటూ మిగతా పార్టీలు ఆయన్ను రెచ్చగొట్టడం తరచూ జరుగుతోంది. కానీ... తొలిసారిగ చంద్రబాబు చేతిలో మనిషి - ఆప్తమిత్రుడు కూడా హైదరాబాద్ డెవలప్ మెంట్ క్రెడిట్ ను చంద్రబాబు ఒక్కరికే కాకుండా మిగతావారికీ ఇచ్చారు. దీంతో చంద్రబాబుకు షాక్ తిన్నంత పనైంది. ప్రత్యేక హోదా విషయంలో వెంకయ్యపై అంతా విమర్శలు కురిపిస్తున్నా తాను మాత్రం ఈగ వాలనివ్వకుండా చూసుకుంటున్నారు చంద్రబాబు... కానీ, వెంకయ్య మాత్రం హైదరాబాద్ క్రెడిట్ విషయంలో చంద్రబాబు గొప్పలను ఏమాత్రం సమర్థించకుండా ఆ క్రెడిట్ ను మరికొందరి ఖాతాలోనూ వేశారు. అదిప్పుడు చంద్రబాబుకు రుచించడం లేదట. సొంత మనిషే తనను సమర్థించకపోతే ఎలా అని తీవ్రంగా మథన పడుతున్నారట.

విజయవాడలో తనకు జరిగిన సన్మాన సభలో మాట్లాడిన వెంకయ్య అనేక అంశాలను ప్రస్తావిస్తూ హైదరాబాద్ అభివృద్దిపైనా మాట్లాడారు. విభజన నాటి పరిణామాలను - రాష్ట్ర గతాన్ని చెబుతూ హైదరాబాద్‌ రాత్రికి రాత్రి అభివృద్ధి చెందలేదని అన్నారు. 40 ఏళ్ల పాటు వెంగళరావు - రామారావు - వైఎస్‌ ఆర్‌ - చంద్రబాబు కష్టపడితే - అది కూడా మొత్తం అభివృద్ధిని ఒకే చోట కేంద్రీకరించడం వల్ల హైదరాబాద్ అభివృద్ధి సాధ్యమైందన్నారు. నిజానికి చంద్రబాబు ఎప్పుడూ హైదరాబాద్ క్రెడిట్ మొత్తం తనదేనని చెప్పుకొంటుంటారు. కానీ... ఆయన మిత్రుడు వెంకయ్య మాత్రం జలగం వెంగళరావు నుంచి వైఎస్ వరకు అందరికీ ఆ క్రెడిట్ ఇవ్వడంతో చంద్రబాబు షాక్ తిన్నారట.

అంతేకాదు... ఎన్డిఏ  నుంచి టీడీపీ బయటకు వస్తే మోదీకి వచ్చిన ఇబ్బంది ఏమీ ఉండదన్న వెంకయ్య వ్యాఖ్యలు కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తేనే ఏపీ అభివృద్ధి సాధ్యమని చెప్పిన వెంకయ్య చివర్లో మాత్రం చంద్రబాబును బాగానే ఊరడించారు. వైసీపీపై విమర్శలు చేసి చంద్రబాబుకు సంతోషం కలిగించారు. ఆంధ్రప్రదేశ్‌ లో కొన్ని పార్టీలకు ప్రత్యేక హోదా కంటే చంద్రబాబు హోదాను తాము సొంతం చేసుకోవాలన్న ఉద్దేశం ఎక్కువగా కనిపిస్తోందని పరోక్షంగా వైసీపీపై ఆయన విమర్శలు చేశారు.
Tags:    

Similar News