రాబోయే ఎన్నికల్లో బీజేపీతో వైసీపీ పొత్తు పెట్టుకోబోతోందని - అందుకు ఆల్రెడీ ఆ రెండు పార్టీల మధ్య చీకటి ఒప్పందం కుదిరిందని కొందరు వదంతులు పుట్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి....ప్రధాని మోదీతో బీజేపీ జాతీయ నేతలతో టచ్ లో ఉన్నారని టీడీపీ ప్రచారం చేస్తోంది. ఈ కారణంతోనే మోదీని జగన్ విమర్శించడం లేదని విష ప్రచారం మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో ఆ పుకార్లకు తెరదించుతూ విజయ సాయి రెడ్డి కీలకమైన ప్రకటన చేశారు. త్వరలో జరగబోతోన్న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో బీజేపీ తరఫున బరిలో దిగే అభ్యర్థికి వైసీపీ మద్దతివ్వబోదని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను బీజేపీ మోసం చేసిందని, కాబట్టి బీజేపీ, దాని మిత్రపక్షాల తరఫు అభ్యర్థికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటు వేయబోమని స్పష్టం చేశారు.
టీడీపీ, వైసీపీ ల మధ్య ఉన్న వైరాన్ని ....క్యాష్ చేసుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోన్న సంగతి తెలిసిందే. మరోవైపు, యథా ప్రకారంగా బీజేపీతో వైసీపీ పొత్తు అంటూ టీడీపీ దుష్ప్రచారం చేస్తోంది. ఈ నేపథ్యంలో విజయ సాయి రెడ్డి ప్రకటనతో ఇటు టీడీపీ....అటు బీజేపీలకు గట్టి షాక్ తగిలింది. బీజేపీతో పాటు బీజేపీకి మద్దతిచ్చే, అనుకూలంగా వ్యహవరించే ఏ పార్టీ అభ్యర్థికీ వైసీపీ ఓటు వేయదని విజయ సాయి రెడ్డి స్పష్టం చేశారు. దీనికి తోడు కొద్ది రోజుల క్రితం...వైసీపీ అధ్యక్షుడు జగన్ కూడా....రాబోయే ఎన్నికల్లో `ఒంటరి పోరాటం` చేస్తానని కుండ బద్దలు కొట్టిన విషయం విదితమే. ఈ రెండు ప్రకటన నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో బీజేపీతో వైసీపీ జత కడుతుందని వస్తోన్న ఊహాగానాలకు తెరపడినట్లయింది. కాగా, గతంలో త్రిపుల్ తలాక్ - రాష్ట్రపతి - ఉపరాష్ట్రపతుల ఎన్నిక - నోట్ల రద్దు - జీఎస్టీ వంటి విషయాల్లో బీజేపీకి వైసీపీ మద్దతిచ్చిన విషయం తెలిసిందే.