ఫేస్ బుక్ పోస్టుతో సీఎం కేసీఆర్ ను మరోసారి ఏసుకున్న రాములమ్మ

Update: 2022-11-01 04:07 GMT
ప్రజాప్రతినిధిగా పని చేసిన వైనం.. సొంత పార్టీని ఏర్పాటు చేసి తర్వాతి కాలంలో పార్టీని విలీనం చేసేసి ఫైర్ బ్రాండ్ నటిగా సుపరిచితురాలు విజయశాంతి. ప్రస్తుతం బీజేపీ నేతగా వ్యవహరిస్తున్న ఆమె.. ఉన్నట్లుండి రాజకీయాలు గుర్తుకు వస్తాయి. అప్పటివరకు కామ్ గా ఉన్నట్లుగా ఉండే ఆమె.. ఒక్కసారిగా అలెర్టు అయి అధికారపక్షాన్ని.. ముఖ్యమంత్రిని తన పోస్టులతో విరుచుకుపడుతుంటారు. తాజాగా అలాంటి పోస్టు ఒకటి ఫేస్ బుక్ లో పెట్టేశారు. ఎప్పటిలానే తన పోస్టులో సీఎం కేసీఆర్ పైనా.. ఆయన ప్రభుత్వంపైనా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

తెలంగాణ రాష్ట్రంలో అవినీతి తాండవం చేస్తుందన్న ఆమె.. తాజాగా తెలంగాణ రాష్ట్రంలోకి సీబీఐ అడుగు పెట్టకుండా ఉత్తర్వులు ఇవ్వటాన్ని తప్పు పట్టారు. గులాబీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో.. అలా అయితే ఆ ఉదంతాన్ని సీబీఐతో విచారణ చేయించాలని కమలనాథులు డిమాండ్ చేయటం తెలిసిందే. ఇలాంటి వేళలోనే.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోకి సీబీఐ అడుగు పెట్టకుండా సీక్రెట్ గా జీవో జారీ చేసిన వైనం బయటకు వచ్చింది. దీనిపై ఆమె తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

రాములమ్మ ఫేస్ బుక్ పోస్టును యథాతధంగా చూస్తే.. 'రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతి తాండవం చేస్తోంది. ఇదంతా బయట పడకుండా ఉండడానికే తాజాగా రాష్ట్రంలోకి సీబీఐ అడుగు పెట్టకుండా కేసీఆర్ సర్కార్ రహస్య ఉత్తర్వులు ఇచ్చింది.

ఇందుకోసం రెండు నెలల కిందటే జీవో నెం.51ని జారీ చేసినప్పటికీ ఇన్నాళ్లూ బయటపెట్టలేదు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలంటూ... బీజేపీ నేతలు హైకోర్టును ఆశ్రయించడంతో ఈ జీవో వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ లిక్కర్‌‌ స్కాంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఆరోపణలు రావడంతోనే సీబీఐ విచారణకు 'నో' చెప్తూ కేసీఆర్ ప్రభుత్వం జీవో 51ని ఇచ్చింది'' అని పేర్కొన్నారు.

అంతేకాదు.. ఈ జీవో విడుదల వెనుక తన కుమార్తె కవితను కాపాడుకోవటమే ముఖ్యమంత్రి కేసీఆర్  లక్ష్యమని ఆరోపించారు. తన పోస్టులో దానికి సంబంధించిన అంశాల్ని చూస్తే.. ''ఆగస్టు 30న ఈ జీవో విడుదలైంది. కవిత మెడకు లిక్కర్ స్కాం ఎక్కడ చుట్టుకుంటుందోనన్న ఆందోళనతోనే రాష్ట్రంలోకి సీబీఐ అడుగుపెట్టకుండా కేసీఆర్ సర్కార్ ఈ ఉత్తర్వులను జారీ చేసింది.

కాళేశ్వరం ప్రాజెక్టులో వేల కోట్ల అక్రమాలు జరిగినట్టు కేంద్ర ప్రభుత్వంతో పాటు దర్యాప్తు సంస్థలకు ఇటీవల పలు ఫిర్యాదులు అందాయి. వాటిపైన కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణకు దిగే అవకాశముందని గుర్తించే సీబీఐకి అనుమతి రద్దు చేస్తూ రాష్ట్ర సర్కారు ఉత్తర్వులిచ్చింది. ఇది చాలదా, తప్పు ఎవరు చేశారో ప్రజలకు అర్థం కావడానికి... మీరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలు నమ్మే స్థితిలో లేరు. వారంతా మీకు తగిన సమాధానం చెప్పక మానరు'' అంటూ ఆమె విరుచుకుపడ్డారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News