తొలి లక్షకు 110 రోజులు.. ఐదో లక్షకు 6 రోజులే!

Update: 2020-06-28 16:30 GMT
ఎంత సంచలనమైనా.. మరెంత స్పైసీ ఇష్యూ అయినా ఐదారు రోజులంతే. కాదంటే మరో వారం. అంతకు మించి ఒకే విషయాన్ని వారాల తరబడి ఫాలో అయ్యేందుకు ప్రపంచం సిద్ధంగా లేని వేళ ఎంట్రీ ఇచ్చింది మాయదారి రోగం. వచ్చీ రాగానే అప్పటికే ఉన్న రూల్స్ మొత్తాన్ని బ్రేక్ చేసేసింది. మానవ చరిత్రలో యావత్ ప్రపంచం ఒకే సమయంలో ఒకేలాంటి భయానికి గురి కావటం ఇప్పటివరకూ చూసింది లేదు. చిన్న.. పెద్ద..పేద.. సంపన్న లాంటి తేడాలు తనకు లేవని.. మనిషి అనేటోడు అయితే చాలన్నట్లుగా వ్యవహరించింది మహమ్మారి.

దాని దెబ్బకు ప్రపంచమే తన దిశను.. దశను మార్చుకునే దుస్థితి. ప్రపంచాన్ని వదిలేసి.. దేశానికి వస్తే.. గడిచిన ఐదు నెలలుగా ఒకే అంశాన్ని అదే పనిగా చర్చించుకోవటం.. వార్తలు రాయటం లాంటివి జరిగింది లేదు. ఇందుకు భిన్నంగా రానున్న మరికొన్ని నెలలు కూడా ఇదే అంశంపై వార్తలు రాయాల్సిన పరిస్థితి. చూస్తుండగానే దేశానికి తొలి కేసు రావటం.. అది కాస్తా ఇప్పుడు ఐదు లక్షల కేసుల వరకూ వెళ్లిపోయింది.

మొదటి లక్ష సంపాదించటం చాలా కష్టం. కానీ.. ఒక లక్ష సంపాదిస్తే చాలు.. రెండో లక్షకు అంత కష్టపడాల్సిన అవసరం ఉండదు. ఆ తర్వాత.. మూడు.. నాలుగు.. ఐదు ఇలా సంపాదించేయొచ్చని డబ్బుల గురించి ఒక ఉదాహరణ పెద్దోళ్లు చెబుతుంటారు. దీనికి ఏ మాత్రం తీసిపోని రీతిలో పాజిటివ్ కేసులు నమోదు దేశంలో ఉంది. దేశంలో తొలి పాజిటివ్ కేసు జనవరి 30న నమోదైతే.. లక్ష కేసులు నమోదు కావటానికి కాస్త అటు ఇటుగా 110 రోజులు పట్టింది. అంటే మూడున్నర నెలలు అన్న మాట.

ఇక.. తాజాగా ఐదు లక్షలకు చేరుకున్న వేళ.. ఐదో లక్ష పాజిటివ్ కేసులు నమోదు కావటానికి పట్టిన సమయం ఎంతో తెలుసా? అక్షరాల ఆరు రోజులు మాత్రమే. దేశంలో వైరస్ వ్యాప్తి ఎంత వేగంగా.. మరెంత తీవ్రంగా ఉందన్న విషయాన్ని చెప్పేందుకు ఈ లెక్క ఒక్కటి సరిపోతుందేమో. మొదటి లక్ష కేసులకు 110 రోజుల పడితే.. రెండో లక్షకు 14 రోజులు పట్టింది. మూడో లక్షకు పది రోజులు పడితే.. నాలుగో లక్షకు ఎనిమిది రోజులు పట్టింది. ఈ లెక్క చూస్తే.. రానున్న రోజుల్లో ఈ వేగం మరెంత పెరుగుతుందన్న విషయమే కాదు.. దాని తీవ్రత దేశం మీదా.. దేశ ప్రజల మీద ఎంత ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
Tags:    

Similar News