మొన్న 900 మంది.. తాజాగా 3వేల మందిని జూమ్ కాల్ లో తీసేసిన ప్రముఖుడు

Update: 2022-03-10 04:29 GMT
కార్పొరేట్ ప్రపంచమంటూ గొప్పలు చెప్పుకునే వారు చాలామంది కనిపిస్తారు కానీ.. దానంతటి కఠినమైన రంగం మరొకటి ఉండదు. అమితమైన ప్రేమ.. అంతలోనే దిమ్మ తిరిగిపోయేలా షాకులు ఇచ్చే విషయంలో ఏ మాత్రం మొహమాటపడని రంగంగా దీన్ని చెప్పొచ్చు.  పేరుకు కార్పొరేట్ అని గొప్పగా చెప్పుకుంటారు. కానీ.. మానవ సంబంధాలు.. ఎమోషన్ కు ఏ మాత్రం దరికి చేరని రంగంగా దీన్ని చెప్పాలి. ఈ మాటకు తగ్గట్లే బెటర్.కామ్ సంస్థ సీఈవో విశాల్ గార్గ్ తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు.

గత ఏడాది డిసెంబరులో కరోనా సెకండ్ వేవ్ ఊపందుకున్న వేళ..తమ సంస్థలో పని చేస్తున్న 900 మంది ఉద్యోగుల్ని ఇట్టే తీసేసి.. సంచలనంగా మారారు. అంతమంది ఉద్యోగుల భవిష్యత్తును ఒక్క జూమ్ కాల్ తో తేల్చేసిన వైనం కార్పొరేట్ వర్గాల్లో సంచలనంగా మారి..హాట్ టాపిక్ అయ్యింది. ఇదే విశాల్ గార్గ్ తాజాగా మరో జూమ్ కాల్ పెట్టి.. ఈసారి ఏకంగా 3వేల మంది ఉద్యోగుల్ని ఇంటికి పంపుతున్నట్లుగా చెప్పి మరో షాకిచ్చారు.

ఆన్ లైన్ లో తనఖా పెట్టుకునే వ్యాపారాన్ని నిర్వహించే బెటర్.కాం సంస్థకు సీఈవోగా భారత సంతతికి చెందిన విశాల్ గార్గ్ ను ఎంపిక చేయటం తెలిసిందే. తాను సంస్థ సీఈవో బాధ్యతల్ని స్వీకరించిన కొద్ది కాలానికే భారీగా ఉద్యోగుల్ని జూమ్ కాల్ పెట్టి తీసేయటం అప్పట్లో సంచలనమైంది. ఈ సంస్థను స్థాపించిన వ్యవస్థాపకుల్లో విశాల్ గార్గ్ ఒకరు కావటం గమనార్హం.

ఈ సంస్థలో దాదాపు 9వేల మంది ఉద్యోగులు పని చేస్తుండగా.. తాజాగా మూడో వంతు ఉద్యోగుల్ని ఒక్క జూమ్ కాల్ తో తీసేసిన వైనాన్ని పలువురు తప్పు పడుతుంటే.. మరికొందరు మద్దతు ఇస్తున్నారు. అయితే.. ఇలా ఉద్యోగాల నుంచి హటాత్తుగా తీసేసిన వారికి మూడు నెలల జీతంతో పాటు.. ఆరోగ్య బీమా కూడా వర్తించేలా నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.

ప్రస్తుతానికి 3 వేల మంది ఉద్యోగుల్ని ఉద్యోగాల నుంచి తీసేసిన సంస్థ.. రాబోయే రోజుల్లో మరికొందరిని సంస్థలోకి కొత్తగా తీసుకుంటామని చెబుతున్నారు. ఏమైనా.. వేలాది మంది ఉద్యోగుల భవిష్యత్తు సంస్థ సీఈవో జూమ్ కాల్ అన్నదిప్పుడు పెద్ద చర్చగా మారింది.


Tags:    

Similar News