'మా' ఎన్నికల్లో పోటీ చేయనంటూ.. నిజాల్ని వరుస పెట్టి చెప్పేశాడు

Update: 2022-09-28 05:18 GMT
ప్రపంచంలోని రాజకీయమంతా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)లోనే ఉందంటూ కొందరు కామెంట్లు చేస్తుంటారు. అలాంటి మాటలో అతిశయోక్తి అన్నది లేదన్న రీతిలో ఇటీవల జరిగిన 'మా' ఎన్నికలు చెప్పకనే చెప్పేశాయి. మా ఎన్నికల ఆరంభం నుంచి.. ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు చోటు చేసుకున్న పరిణామాలు.. విచిత్రాలు.. వింతలు అన్ని ఇన్ని కావు. అత్యంత సంచలనంగా మారిన ఈసారి 'మా' ఎన్నికల్లో అధ్యక్షుడిగా మంచు విష్ణు సంచలన విజయాన్ని సొంతం చేసుకోవటం తెలిసిందే.

కట్ చేస్తే.. మంచు విష్ణు నటించిన తాజా చిత్రం జిన్నా. త్వరలో ప్రేక్షకులకు ముందు రానున్న ఈ హారర్ కామెడీ మూవీపై ఇప్పుడు మాంచి బజ్ నెలకొంది. ఇటీవల కాలంలో మంచు ఫ్యామిలీ నుంచి వచ్చిన సినిమాల్లో 'జిన్నా'కు వచ్చిన బజ్ మరే మూవీకి రాలేదన్న వాస్తవాన్ని ఒప్పుకోవాలి. ఈ సినిమా విడుదల నేపథ్యంలో ఒక ప్రధాన మీడియా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆసక్తికర అంశాల్నివెల్లడించారు.

మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. 'మా' ఎన్నికల్లో ఇక పోటీ చేయనంటూ సంచలన వ్యాఖ్య చేశారు మంచు విష్ణు. 'నేను మళ్లీ పోటీ చేయను. రాజకీయాల్లోకి వచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారు. కానీ.. అందులో నిజం లేదు. నటుడిగా నా జీవితం బాగుంది. మంచి గుర్తింపు వచ్చేలా కష్టపడతా' అంటూ కొత్త విషయాన్ని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా మరిన్ని వాస్తవాల్ని ఆయన చెప్పేయటం గమనార్హం.

తన సినిమాల్ని తొలి కాపీ చూశాక.. మళ్లీ ఆ సినిమాను చూడటానికి ఇష్టపడనని.. వెండితెరపై తనను తాను చూసుకోవటానికి సిగ్గు అంటూ షాకింగ్ నిజాన్ని వెల్లడించారు. అంతేకాదు.. తన స్థాయి గురించి ఓపెన్ అయ్యారు. 'నేను టాప్ 5 నటుల జాబితాలో లేను.

ఇది అందరికీ తెలిసిన విషయమే. టాప్ 5 లోపు రావాలని ఉంది. అందుకు ప్రయత్నిస్తా' అన్న విష్ణు.. తన తాజా మూవీ జిన్నాను అక్టోబరు 5న కాకుండా అక్టోబరు 21న విడుదల చేస్తున్నట్లు చెప్పారు.

జిన్నా మూవీకి ప్రత్యేక ఆకర్షణగా మారిన సన్నీ లియోనీ గురించి చెబుతూ.. ఆమె తనకు మంచి స్నేహితురాలిగా పేర్కొన్నారు. తాను ఎంపిక చేసుకున్న పాత్రకు న్యాయం చేస్తుందని.. ఈ సినిమాలో ఆమెను ఫిక్సు చేసుకున్న తర్వాతే నిర్మాతలు తనను సంప్రదించినట్లు చెప్పారు. 'మా' ఎన్నికల్లో అధ్యక్షుడు అయ్యేందుకు విష్ణు పడిన కష్టం అంతా ఇంతా కాదు. అలాంటి ఆయన.. ఇకపై ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పటం వెనుక అసలు సంగతేంటి? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News