వైఫ్ ను దగ్గరకు రానివ్వని ‘కెప్టెన్’

Update: 2016-07-07 05:29 GMT
మితిమీరిన ఆత్మవిశ్వాసం.. ఎంతగా నష్టం జరుగుతుందన్న విషయం తెలుసుకోవాలంటే ఒకప్పటి సినీ హీరో.. డీఎండీకే అధినేత విజయకాంత్ ను చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ఓవర్ కాన్ఫిడెన్స్ తో చేతిలోకి వచ్చే అధికారాన్ని చేజార్చుకున్న వ్యక్తిగా ఆయన్ను చెప్పొచ్చు. మొండితనంతో పాటు.. పార్టీ వ్యవహారాల్లోకి భార్యను ఎక్కువగా తీసుకొచ్చిన ఆయన.. ఆమె ఇచ్చిన సలహాల్ని పాటించి మొదటికే మోసపోయిన పరిస్థితి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కీలకభూమిక మారే అవకాశం ఉన్నప్పటికీ చేతులారా చేసిన తప్పులతో ఆయన అటూఇటూ కాకుండా పోయిన దుస్థితి.

డీఎంకేతో చేతులు కలిపేందుకు చర్చలు ఒక కొలిక్కి వచ్చేసిన వేళ.. విజయకాంత్ సతీమణి ప్రేమలత జోక్యం చేసుకొని.. రెండు పార్టీల మధ్య పొత్తు ఒప్పందం కుదరకుండా చేయటంలో కీలకపాత్ర పోషించారు. ఈ నిర్ణయమే తమిళనాడు ఎన్నికల్లో జయలలిత చారిత్రక విజయానికి కీలకంగా చెప్పాలి. బలమైన రాజకీయ పక్షాల ఓట్లు కలవాల్సిన వేళ.. డీఎంకే.. డీఎండీకే ఓట్లు చీలిపోవటం అమ్మకు కలిసి వచ్చింది.

ఎన్నికల వేళ అవసరానికి మించిన ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించిన కెప్టెన్ కు ఓట్లర్లు ఇచ్చిన తీర్పుతో దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది. అప్పటివరకూ విజయకాంత్ తిట్టినా.. కొట్టినా.. ఏం చేసినా పవర్ వస్తుందన్న ఉద్దేశంతో భరించిన నేతలు.. ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ నుంచి జంప్ అయ్యేందుకు సిద్ధమయ్యారు. దీనికి తోడు కెప్టెన్ వైఫ్ ప్రేమలత వ్యవహారంపై కూడా వారు తీవ్ర అసంతృప్తితో ఉండటంతో.. పార్టీ వ్యవహారాల్లో ఆమె జోక్యం ఎంతగా దెబ్బ తీసిందన్న విషయాన్ని విజయకాంత్ కు అర్థమయ్యేలా చెప్పిన నేతలు.. ఆమె జోక్యం ఏమీ ఉండకూదని తేల్చి చెప్పినట్లు చెబుతున్నారు.

భార్య మీద వెల్లువెత్తుతున్న అసంతృప్తిని గుర్తించిన విజయ్ కాంత్ ఆమెను పార్టీకి దూరంగా పెట్టినట్లుగా కనిపిస్తుంది. పార్టీ దగ్గరకు రానివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న కెప్టెన్.. ఈ విధానాన్ని ఎంత కాలం కొనసాగిస్తారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. పార్టీలో ఆమె జోక్యం మొదలైతే మాత్రం.. తాము కొనసాగే అవకాశం లేదన్న విషయాన్ని పలువురు నేతలు కెప్టెన్ కు స్పష్టం చేసినట్లు తెలుస్తుంది. ఈ కారణం చేతనే.. కెప్టెన్ భార్యను పార్టీ దగ్గరకు రానివ్వటం లేదని చెబుతున్నారు.

Tags:    

Similar News