కరివేపాకు పేరు చెప్పి గంజాయి దందా

Update: 2021-11-15 23:30 GMT
డ్రగ్స్ దందా జోరుగా కొనసాగుతోంది. ఈ దందాను రూపుమాపేందుకు పోలీసులు ఎన్ని చర్యలు చేపడుతున్నా.. చాపకింద నీరులా డ్రగ్స్ వ్యాపారం కొనసాగుతోంది. దీంతో భారత్ మాదక ద్రవ్యాలకు అడ్డాగా మారుతోంది. ప్రతీరోజు అనేక ప్రాంతాల్లో డ్రగ్స్ పట్టుబడుతుండడం ఇందుకు నిదర్శనంగా చెప్పొచ్చు.

గంజాయి, డ్రగ్స్ కేటుగాళ్లు విక్రయాలను కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. వాటి సరఫరాకు ఉన్న ఏ అవకాశాన్ని వదలడం లేదు. లారీలు, కార్లు, ఆటోలు, టూవీలర్, చివరకు విమానాల్లో కూడా మత్తు పదార్థాలు పెద్ద ఎత్తున పట్టుబడుతూనే ఉన్నాయి. అయినా స్మగ్లర్లూ రూటు మార్చారు.

ఆధునిక యుగంలో అంతా ఆన్ లైన్ అయిపోయింది. ఏ వస్తువు కావాలన్నా ఆన్ లైన్ షాపింగ్ ఫ్లాట్ ఫారమ్స్ ను ఆశ్రయిస్తున్నారు.

ఇప్పుడు గంజాయి విక్రయాలు కూడా ఆన్ లైన్ వేదికగా సాగడం మరింత కలవరానికి గురిచేస్తోంది. అమెజాన్ ను ఉపయోగించి ఏపీలోని విశాఖపట్నం నుంచి మధ్యప్రదేశ్ కు అక్రమంగా గంజాయి తరలించిన ఇద్దరిని ఎంపీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి దగ్గర 20 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

గత 4 నెలలుగా అమెజాన్ ద్వారా సుమారు టన్ను గంజాయి అక్రమంగా రవాణా చేసినట్టు పోలీసుల విచారణలో నిందితులు అంగీకరించారు. గ్వాలియర్ లోని మోరార్ కు చెందిన సూరజ్ అలియాస్ కల్లు పావయ్య, భింద్ జిల్లాలో రోడ్డు పక్కన దాబా నడుపుతున్న పింటూ అనే ఇద్దరూ 20 కిలోల నిషిద్ధ వస్తువులతో పట్టుబడ్డారు. నాలుగు నెలల్లో రూ.1.10 కోట్ల విలువైన లావాదేవీలు జరిగినట్టు భింద్ ఎస్పీ వెల్లడించారు.

ఆన్ లైన్ ద్వారా సేకరించిన గంజాయి ప్రధానంగా భింద్ లోని రోడ్డుపక్కన దాబా నుంచి విక్రయించినట్టు గుర్తించారు. ఎంపీలోని భోపాల్, గ్వాలియర్ వంటి ఇతర నగరాలకు, ఉత్తరాఖండ్ లోని హరిద్వార్, రాజస్థాన్ లోని కోటకు కూడా తరలించినట్టుగా పోలీసులు గుర్తించారు. కరివేపాకు విక్రయదారుడే గంజాయి ఆ పేరుతో విక్రయించినట్టు తేల్చారు.

-గుజరాత్ లో 600 కోట్లు విలువైన 120 కిలోల హెరాయిన్ స్వాధీనం
ఇక గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) తాజాగా సుమారు రూ.600 కోట్ల విలువైన 120 కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకుంది. గత ఐదు నెలల కాలంలో గుజరాత్ లో రూ.24800 కోట్ల విలువైన అక్రమ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకోవడం సంచలనంగా మారింది. ఈ వ్యవహారంలో కొందరిని అరెస్ట్ చేశారు.




Tags:    

Similar News