ఎన్ని వేషాలు; అమ్మ.. ఫోక్స్ వ్యాగన్

Update: 2015-09-23 05:27 GMT
పేరు మోసిన కంపెనీల ఉత్పత్తుల విషయంలో నాణ్యత పక్కా అని ఆలోచిస్తుంటాం. కానీ.. కొన్ని కంపెనీలు మాత్రం తమకున్న పేరు ప్రఖ్యాతుల్ని సొమ్ము చేసుకోవటానికి అడ్డదారులు తొక్కే వైనం షాకింగ్ గా అనిపించక మానదు. తాజాగా ఫోక్స్ వ్యాగన్ వ్యవహార చూస్తే ఇది నిజమనిపిస్తుంది. జర్మన్ వాహన దిగ్గజమైన ఫోక్స్ వ్యాగన్ లీలలు బయటకు వచ్చి షాకింగ్ కలిగిస్తున్నారు.

చేసిన పాపానికి పరిహారంగా.. ఆ కంపెనీ విలువ 40 శాతం పడిపోయింది. ఇంతకీ ఫోక్స్ వ్యాగన్ చేసిన దారుణ మోసం ఏమిటంటే.. తమ వాహనాల కారణంగా కాలుష్యం చాలా తక్కువగా ఉంటుందని చెప్పుకొచ్చింది. ఇందుకోసం పలు ప్రమాణాల్ని చూపించింది. నిజమే కాబోలు అనుకున్న వారికి.. సదరు కంపెనీ ఆడిన నాటకం బయటకు వచ్చింది.

తమ కార్ల నుంచి వెలువడే కాలుష్యాన్ని తక్కువ చేసి చూపించేలా ఒక సాఫ్ట్ వేర్ ను రూపొందించిన ఫోక్స్ వ్యాగన్ దుర్మార్గం తాజాగా బయటకు వచ్చింది. ఈ వ్యవహారం బయటపడిన నేపథ్యంలో అమెరికా.. దక్షిణ కొరియా.. ఫ్రాన్స్ దేశాలు.. ఫోక్స్ వ్యాగన్ ‘‘కాలుష్య కుంభకోణం’’పై కన్నెర్ర చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై విచారణకు ఆదేశించింది.

తాజా పరిణామాలతో ఫోక్స్ వ్యాగన్ కంపెనీ షేరు విలువ 40 శాతానికి పడిపోయింది. కాలుష్యాన్ని తక్కువగా చేసి చూపించే దొంగ సాఫ్ట్ వేర్ ను దాదాపు 1.1కోట్ల డీజిల్ కార్లలో ఉపయోగించినట్లుగా భావిస్తున్నారు. సదరు దొంగ సాఫ్ట్ వేర్ కానీ లేకపోతే.. ఈ కార్ల నుంచి వచ్చే కాలుష్యం.. అమెరికా తదితర దేశాల్లోని పరిమితుల కంటే దాదాపు 40 రెట్లు అధికంగా కాలుష్యం వెదజల్లుతుందని తేల్చారు. అంటే.. నిర్దేశించిన ప్రమాణాల కంటే 40 రెట్లు అధికంగా కాలుష్యం వెదజల్లినా.. మాయ సాఫ్ట్ వేర్ పుణ్యమా అని కాలుష్యం అన్నది అస్సలు లేదన్నట్లుగా చూపించింది.

ఇప్పటికి ఆరోపణలుగా వినిపిస్తున్న ఈ వ్యవహారం కాని నిజమని తేలితే మాత్రం.. అమెరికాలోనే ఈ కంపెనీ మీద దాదాపుగా 1.3లక్షల కోట్ల రూపాయిలు జరిమానాగా విధించే వీలుందని చెబుతున్నారు. ఇక.. అమెరికా కాకుండా మిగిలిన దేశాల్లో పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యే అవకాశం ఉంది. మరి.. ఈ ఇష్యూ నుంచి ఫోక్స్ వ్యాగన్ కోలుకుంటుందా? లేదా? మునిగిపోతుందా? చూడాలి.
Tags:    

Similar News