వైసీపీలో వెయిటింగ్....యమ డేంజరేనా... ?

Update: 2021-12-14 12:30 GMT
అధికార వైసీపీలో అంతా సవ్యంగా ఉందా. అంతా హ్యాపీగా ఉన్నారా. జరిగిపోయిన ఎన్నికలు వైసీపీకి ఏకపక్ష విజయాలు అందించాయి. అదే సమయంలో బంపర్ మెజారిటీ, ఎటు చూసినా వైసీపీ వారే కనిపిస్తున్న నేపధ్యం ఉంది. దాంతో వైసీపీ పటిష్టమైన భవనంగా కనిపిస్తోంది. కానీ నిజానికి అలాంటి పరిస్థితి లోపల ఉందా అంటే సమాధానం సులువే.

అధికారంలో ఉన్న ఏ పార్టీకైనా ఉండే తలనొప్పులు అన్నీ  కూడా వైసీపీలో కూడా చాలానే  ఉన్నాయి. పదవులు వచ్చిన వారి బాధ ఒకలా ఉంటే రాని వారి గోల మరోలా ఉంది. ఇక మంత్రి పదవుల కోసం వెయిట్ చేసే వారు చేస్తున్నారు. వారందరూ జగన్ పెట్టిన డెడ్ లైన్ ని చూసి ఇపుడు యాక్టివ్ అవుతున్నారు. తొంబై శాతానికి పైగా మంత్రులను తప్పించి కొత్త వారికి అవకాశాలు ఇస్తారని చాలా మంది ఆశపడుతున్నారు.

అయితే నిజంగా అలా జరుగుతుందా లేదా అన్నది హై కమాండ్ కే తెలుసు. మరో వైపు చూస్తే ఎంత తొంబై శాతం మందికి పదవులు పంచినా గట్టిగా మరో ఇరవై మందికి మించి అవి దక్కవు. చూసుకుంటే 13 జిల్లాల నుంచి జిల్లాకు ముగ్గురు నలుగురు వంతున కచ్చితంగా అరవై మంది దాకా మంత్రి పద‌వుల కోసం కాచుకుని ఉన్నారు. ఇరవై మందికి మంత్రి పదవులు ఇచ్చినా నలభై మందికి పైగా ఎమ్మెల్యేలు  తీవ్రమైన అసంతృప్తికి గురి కావడం తధ్యం.

మరి వారిని ఎలా సముదాయిస్తారు అన్నది అతి పెద్ద చిక్కు ప్రశ్న. వారి సంగతి అలా ఉంటే నామినేటెడ్ పదవులు రాని వారు, తమకు వైసీపీలో ఎలాంటి అవకాశాలు ఈ రోజుకీ దక్కని వారు చాలా పెద్ద ఎత్తున వున్నారు. వారంతా కూడా లోలోపల రగిలిపోతున్నారు. వారు కూడా తమ బాధను వ్యక్తం చేయడానికి సరైన నిర్ణయం తీసుకోవడానికి ఒక మంచి ముహూర్తం కోసం చూస్తున్నారు.

వైసీపీలో ఇపుడు అంతా బయటకు కూల్ గా కనిపిస్తోంది. కానీ ఒక్కసారి  మంత్రివర్గ విస్తరణ అన్న తేనే తుట్టెని కనుక కదిపితే మాత్రం లావాలా అసమ్మతి పొంగి పొరలుతుందని అంటున్నారు. అపుడు మంత్రి పదవులు రాని వారితో పాటు పార్టీలో తమకు ఏ  విధంగా ఆదరణ లేదని భావించేవారు అంతా కూడా నానా  యాగీ చేయడానికి ఒక్కటి అవుతారు అంటున్నారు.

మరి వైసీపీలో ఇలాంటి పరిస్థితులు ఉంటాయని, అసంతృప్తి  చాప కింద నీరులా ఉంటుందని హై కమాండ్ కి తెలియదా అంటే వారికి కూడా తెలిసే ఉంటుంది. అందుకే మంత్రి వర్గ విస్తరణ కంటే ముందే ఇలాంటి వాటిని గుర్తించి సర్దుబాట్లు చేస్తారు అని చెబుతున్నారు. అయితే వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తే పదవులు ఇస్తామని ఈ సమయంలో చెప్పినా దానిని ఎంత మంది నమ్ముతారు, ఎంతమంది తగ్గి ఉంటారు అన్నది కూడా ఆలోచించాలి. త్యాగయ్యలు ఇపుడు ఏ పార్టీలో కూడా పెద్దగా కనిపించరు. వస్తే ఇపుడే పదవి రావాలి. లేకపోతే మీకూ మాకూ రాం రాం అంటూ తలాఖ్ అనేసే బాపతే ఎక్కువ.

మొత్తానికి వైసీపీలో అసంతృప్తి బయటకు కనబడకుండా బాగానే ఉంది అని విపక్షాలు కూడా నమ్ముతున్నాయి. అవి కూడా మంత్రి వర్గ విస్తరణ ముహూర్తం కోసమే ఎదురుచూస్తున్నాయి. నిజంగా లావాలా వైసీపీలో అసంతృప్తి వెల్లువలా ఉబికి పైకి లేస్తుందా. ఏమో. రాజకీయం ఇది. అధికారం కోసం పదవుల కోసం పాకులాడే కాలమిది. ఏమైనా జరగవచ్చు. పైగా అధినాయకత్వం పట్టించుకోవడంలేదు అన్న బాధతో రగులుతున్న వారంతా ఒక చోటకు చేరితే అది డేంజర్ సిగ్నల్స్ నే మోగించడం ఖాయమని అంటున్నారు.
Tags:    

Similar News