రాజమహల్ రిపేర్ల తీరు చూస్తే.. జిల్లా పక్కానే

Update: 2016-06-27 05:33 GMT
తెలంగాణలో ఏర్పాటు చేయాలనుకున్న కొత్త జిల్లాల మీద ఎంత భారీ కసరత్తు జరుగుతుందో తెలిసిందే. కొత్త జిల్లాలకు సంబంధించి చర్చల దశలోనే ఉన్నప్పటికి కొన్ని జిల్లాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ వచ్చేసినట్లేనని చెబుతున్నారు. కొత్త జిల్లాల ప్రకటన చూసిన వెంటనే.. పనులు మొదలయ్యేందుకు వీలుగా కొన్నిజిల్లాలకు సంబంధించిన పనుల్ని లోగుట్టుగా స్టార్ట్ చేశారన్న మాట వినిపిస్తుంది.

ఈ వాదనకు బలం చేకూరేలా వనపర్తిలో తాజా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక్కడి రాజమహల్ కు జరుగుతున్న మరమ్మతుల జోరు చూస్తే.. వనపర్తిని జిల్లాగా ప్రకటించటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. రాజమహల్ ను జిల్లా కలెక్టరేట్ గా ఏర్పాటు చేయటం ఖాయమన్న మాట వినిపిస్తోంది సువిశాలమైన 20 ఎకరాల్లో విస్తరించి ఉన్న రాజమహల్ ఉండటం.. దీనికి అవసరమైన మరమ్మతులు.. పెయింటింగ్ తదితరాలకు అవసరమైన నిధులు ఎంతన్నది లెక్క తేల్చాలంటూ ఆదేశాలు రావటంతో పాటు.. అధికారులు సైతం వీటి ప్రతిపాదనను సిద్ధం చేసేందుకు చేస్తున్న కసరత్తు చూస్తే.. వనపర్తి జిల్లా కావటం ఖాయమని.. రాజమహల్ ను కలెక్టరేట్ గా ఎంపిక చేయటం పక్కా అని చెబుతున్నారు.

ప్రస్తుతం ఈ రాజమహల్ లో పాలిటెక్నిక్ కళాశాల సాగుతోంది. దాన్ని కొత్త భవనంలోకి మార్చి.. ఇందులోకి కలెక్టరేట్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఇందుకు వీలుగా ఈ భవనానికి సంబంధించిన పత్రాల్ని అధికారులు సునిశితంగా పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. కొత్తజిల్లాల్లో వనపర్తి ఒకటి ఉండటమే కాదు.. దాని కలెక్టరేట్ కార్యాలయం ఏమిటన్నది క్లారిటీ వచ్చేసినట్లేనని చెప్పక తప్పదు.
Tags:    

Similar News