కరోనా వ్యాక్సిన్ కోసం రూ.80వేల కోట్లు కావాలా?

Update: 2020-09-27 05:10 GMT
కరోనా మహమ్మారితో తల్లడిల్లుతున్న ప్రపంచం.. ఇప్పుడు దానికి సరైన రీతిలో చెక్ పెట్టే వ్యాక్సిన్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తుంది. ఇప్పటికే కొన్ని వ్యాక్సిన్లు వచ్చినట్లుగా ప్రచారం జరుగుతున్నా.. అదేదీ కూడా భద్రమైనదన్న భావన కలిగేలా చేయటంలో ఫెయిల్ అయ్యాయని చెప్పాలి. ఇప్పటికే రష్యా స్పుత్నిక్ - వీ పేరుతో వ్యాక్సిన్ విడుదల చేయగా.. ఆస్ట్రాజెనెకా.. మోడర్నా తదితర సంస్థలు తమ క్లీనికల్ టెస్టుల్ని తుది దశకు తీసుకొచ్చాయి.

అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ ఏడాది చివరకు వ్యాక్సిన్ వచ్చే వీలున్నట్లుగా ప్రచారం జోరుగా సాగుతోంది అయితే.. వ్యాక్సిన్ కొనుగోలు విషయంలో ఇప్పటికే పలు దేశాలు పక్కా ప్లానింగ్ చేసుకుంటూ ఉంటే.. మన దేశంలో మాత్రం ఈ అంశంపై విధానపరమైన నిర్ణయాలు ఏమీ తీసుకోలేదు. ఇదిలా ఉంటే.. తాజాగా కరోనా వైరస్ కు వ్యాక్సిన్ తయారీలో కీలకంగా వ్యవహరిస్తున్న సీరం సంస్థ సీఈవో ఆదార్ ఫూణావాల కీలక వ్యాఖ్య ఒకటి చేశారు. సోషల్ మీడియాలో ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది.

వ్యాక్సిన్ విషయంలో ఆయన చెబుతున్న మాటలు చూస్తే.. ప్రభుత్వం ఎంత అలెర్టుగా ఉండాలన్న విషయాన్ని స్పష్టం చేస్తుందని చెప్పాలి. కోవిడ్ ప్రభావిత దేశాల్లో ముందున్న భారత్ లాంటి దేశంలో వ్యాక్సిన్ కొనుగోలు.. పంపిణీ మార్గర్శకాల లాంటి విషయాల్లో ఎంత రెఢీగా ఉన్నమన్నది అసలు ప్రశ్న. ఇదే విషయాన్ని తన ట్వీట్ తో ప్రస్తావించారు సీరం సీఈవో.

వ్యాక్సిన్ కోసం వచ్చే ఏడాదికి రూ.80వేల కోట్లు ఖర్చు పెట్టేందుకు వీలుగా భారత్ సిద్ధంగా ఉందా? అని సూటిగా ప్రశ్నించారు. వ్యాక్సిన్ కొనుగోలు.. దేశంలోని ప్రతి ఒక్క వ్యక్తికి దానిని పంచేందుకు ఆరోగ్య శాఖకు అవసరమైన బడ్జెట్ గా ఆయన వెల్లడించారు. రానున్న రోజుల్లో దేశం ఎదుర్కొనే అతి పెద్ద సవాలు ఇదేనని వ్యాఖ్యానించారు. దేశీయ.. విదేశీ ఫార్మా కంపెనీల్ని సంప్రదించి టీకాను కొనుగోలు చేసే విషయంలో పక్కా ప్లానింగ్ అవసరమని అంటున్నారు. మరి.. ఆయన వ్యాఖ్యల్ని కేంద్రం ఏ మేరకు సీరియస్ గా తీసుకుంటుందో చూడాలి.
Tags:    

Similar News