వీళ్లు చీల్చలేదు.. వాళ్లే చీలిపోయారు!

Update: 2017-08-01 04:40 GMT
మడత  పేచీ మాటలంటే ఇలాంటివే. చాపకింద నీరులాగా కాగల కార్యం చక్కబెట్టేసి పైకి మాత్రం తమకేమీ సంబంధం లేదని, తాము చేసిందేమీ లేదంటూ బుకాయించడం రాజకీయాల్లో తరచుగా కనిపిస్తూ ఉంటుంది. చిన్నగా చిచ్చు రాజేసి వదిలేస్తే.. అది కాస్తా దావానలంగా దహించేస్తున్నా.. అబ్బే మాకేమీ తెలియదు.. మాకు సంబంధం లేదు అంటూ బుకాయించవచ్చు. ఇప్పుడు బీహార్ పరిణామాల గురించి భాజపా ఇలాంటి వ్యాఖ్యానాలే చేస్తోంది.

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఎన్డీయే కు జైకొట్టిన పుణ్యమాని ఆ పార్టలో అంతర్గతంగా కొత్త సంక్షోభం నెలకొన్న సంగతి అందరికీ తెలుసు. పార్టీ అధ్యక్షుడు శరద్ యాదవ్ కూడా నితీశ్ నిర్ణయంతో తీవ్రంగా విభేదిస్తున్నారు. లాలూ పార్టీ, కాంగ్రెస్ లతో కలసి మహా కూటమి నిర్మాణం కావడానికి చాలా కష్టపడ్డామని... తీరా దాన్ని నితీశ్ తన స్వార్థం కోసం తృటిలో ముంచేశారని శరద్ యాదవ్ కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. నితీశ్ సర్కారులోనూ, ఆయన సొంత పార్టీ ఎమ్మెల్యేల్లోనూ కూడా పలువురిలో భాజపాతో జట్టుకట్టడం గురించి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే.. జేడీ యూ చీలిక దిశగా నడుస్తూ ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది.

ఇన్ని పరిణామాలు చోటు చేసుకుంటున్నా.. వారి మద్దతుతో కేంద్రంలో తాము కూడా బలపడిన... బీహార్లో అధికారం పంచుకుంటున్న భారతీయ జనతా పార్టీ మాత్రం.. తామెవ్వరినీ చీల్చలేదని చెబుతోంది. బీహార్ మహా కూటమి చీలిపోవడానికి కారణం తాము కాదని భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సెలవిచ్చారు. అవినీతి అంశంపై వారిలోని భిన్నాభిప్రాయాలే ఆ కూటమి కూలిపోయేలా చేశాయని అంటున్నారు.

బీహార్ పరిణామాలు.. భాజపా ద్వంద్వ ప్రమాణాల పట్ల దేశవ్యాప్తంగా విపక్ష పార్టీలు అప్రమత్తం అయ్యే పరిస్థితిని కల్పిస్తున్నాయి. ఎందుకంటే.. ఇప్పటికే ఈశాన్య రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను చీల్చారు. తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన ఎమ్మెల్యేలను కూడా చీల్చారు. తమిళనాడులో అన్నా డీఎంకే చీలికవర్గాల వ్యవహారాన్ని తెరవెనుక ఉండి ప్రోత్సహించి.. నడిపించారు. బీహార్లో ఏకంగా ప్రభుత్వాన్నే కూల్చి తాము భాగం పంచుకుంటూ తిరిగి గద్దె ఎక్కారు.. ఇన్ని పరిణామాలు భాజపా నడిపిస్తున్నప్పటికీ.. అమిత్ షా మాత్రం.. తామెవ్వరినీ చీల్చడం లేదని.. ఎంచక్కా సెలవిస్తున్నారు. అదే మరి రాజకీయం అంటే!
Tags:    

Similar News