ఎన్ని ఎకరాల్లో కేసీఆర్ ‘ఆలూ’ సాగు చేస్తున్నారో తెలుసా?

Update: 2021-01-06 15:30 GMT
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరించే అధినేతకు సంబంధించిన వ్యక్తిగత ఇష్టాయిష్టాలు పెద్దగా బయటకు రావు. వచ్చినా అవి చాలా పరిమితంగా ఉంటాయి. దేశంలోని మరే రాష్ట్ర ముఖ్యమంత్రిలో కనిపించని విలక్షణత తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ సొంతం. సెక్రటేరియట్ కు వెళ్లానికి ఏ మాత్రం ఇష్టపడని ఆయన.. తాను ఎక్కడ ఉంటే అక్కడే సెక్రటేరియట్ గా చెప్పటం తెలిసిందే. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఆయన అధికారిక నివాసమైన ప్రగతి భవన్ కంటే కూడా ఫాంహౌస్ లోనే ఎక్కువగా ఉండటం కనిపిస్తుంది.

అదే పనిగా ఫాంహౌస్ లో గడిపే కేసీఆర్ ఏం చేస్తుంటారన్న ఆసక్తి ఎంతోమందికి ఉంటుంది. అయితే.. ఇందుకు సంబంధించిన సమాచారం పెద్దగా బయటకు రాదు. కాకుంటే..సారుకు సన్నిహితంగా ఉండే కొందరు మాత్రం ఫాంహౌస్ లోపల ఏం జరుగుతుందన్న విషయాల్ని లోగుట్టుగా చెబుతుంటారు. కేసీఆర్ కు ఇష్టమైన వ్యవసాయంతో పాటు చర్చలు.. రాజకీయ మథనాలు.. కొందరు ముఖ్యులతో సమావేశాల్ని నిర్వహిస్తుంటారు. రోజువారీగా తనకున్న సమయంలో కొంత భాగాన్ని కచ్ఛితంగా వ్యవసాయం మీదన.. వ్యవసాయ పనుల మీదన ఫోకస్ చేస్తారని చెబుతారు. ప్రయోగాత్మక పంటలు.. వాటి మీద పని చేసే నిపుణులు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఉన్నా వారిని వెతికి మరీ ఫాంహౌస్ కు రప్పించి.. వారి సలహాలు.. సూచనలు తీసుకుంటారని చెబుతారు.

దీనికి తగ్గట్లే బంగాళదుంపల సాగుకు సంబంధించి ఇటీవల రైతుతో మాట్లాడటం తెలిసిందే. అయితే.. ఆలూ సాగు విషయంలో ఇప్పటికే సారు నిర్ణయం తీసుకోవటమే కాదు.. 24 ఎకరాల్లో పంటను వేసినట్లుగా చెబుతున్నారు. భారీ ఆదాయం వచ్చే ఈ పంట సాగు కోసం ఎకరానికి రూ.40 వేల వరకు ఖర్చు వస్తుందని.. అయితే ఆదాయం కూడా బాగా వస్తుందని చెబుతున్నారు. ఉత్తరాదిన ఎక్కువగా పండించే ఈ పంటను దక్షిణాదిన తక్కువగా పండిస్తారు. దీనికి కారణం ఉష్ణోగ్రతలే. ఆలూ సాగుకు అవసరమైన ఉష్ణోగ్రతలు మనకు అనువుగా లేకపోవటమే. ఆలూ సాగుకు 18 నుంచి 20 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు చాలా అవసరం. మరి.. మన దగ్గర టెంపరేచర్ ఎంత ఎక్కువగా ఉంటుందో తెలిసిందే. మరి.. ఈ ప్రతికూలతను కేసీఆర్ ఎలా అధిగమిస్తారో చూడాలి.
Tags:    

Similar News