దారుణంగా హత్య చేసి ఒప్పుకున్నాక కూడా 'గారు' ఏంది ఎస్పీ సాబ్?

Update: 2022-05-24 05:14 GMT
చట్టం ముందు ఎవరైనా ఒక్కటే. నేరం చేసినోడు అసమాన్యుడైనా.. సామాన్యుడైనా నిందితుడే అవుతాడు కానీ మరొకటి కాదు. వ్యవస్థలు అధికారానికి తల వంచే దరిద్రపుగొట్టు లక్షణాన్ని అంతకంతకూ వంట పట్టించుకునే వేళలో.. దారుణ హత్య చేసిన నిందితుడు అధికార పార్టీ ఎమ్మెల్సీ అయినంతనే.. ఆయనకు ఎనలేని గౌరవ మర్యాదల్ని ఇస్తూ.. సదరు నిందితుడి విషయంలో పోలీసు ఉన్నతాధికారుల మర్యాదను ఎలా అర్థం చేసుకోవాలన్నదే ప్రశ్న.

తన మాజీ డ్రైవర్ ను దారుణంగా హత్య చేయటమే కాదు.. దాన్ని ప్రమాదంగా చిత్రీకరించటం కోసం డెడ్ బాడీని ఏమేం చేశామన్న విషయాన్ని వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు చెప్పేసిన తర్వాత కూడా ఆయనకు వీఐపీ ట్రీట్ మెంట్ ఇవ్వటం ఏమిటన్నది ప్రశ్న.

తన మాజీ డ్రైవర్ సుబ్రహణ్మంను తాను హత్య చేసిన విషయాన్ని కాకినాడ జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు వెల్లడించే క్రమంలో నేరాన్ని ఒప్పేసుకున్న ఎమ్మెల్సీని ఉద్దేశించి ఆయన్ను సంబోధించిన తీరుపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. హత్య జరిగిన నాలుగు రోజులకు.. అది కూడా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తి.. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకం వ్యక్తమవుతున్న వేళ.. అదుపులోకి తీసుకొని అరెస్టు చేసిన వైనం హైడ్రామాను తలపించిందన్న విమర్శ వినిపిస్తోంది.

ఎందుకంటే హత్య గురించిన వివరాల్ని వెల్లడించే క్రమంలో జిల్లా ఎస్పీ.. ''ఎమ్మెల్సీ అనంతబాబు గారు నేరం చేసినట్లు అంగీకరించారు'' అని చెప్పిన తీరు విస్మయానికి గురి చేస్తోంది.

హత్య నేరాన్ని అంగీకరించిన నిందితుడి విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరు ఒక ఎత్తు అయితే.. హత్య కేసుకు సంబంధించిన నిందితుడని తనకు తానే ఒప్పేసుకున్నతర్వాత.. వీఐపీ తరహాలో మర్యాద ఇవ్వటం ఏమిటి? అన్నది అసలు ప్రశ్న. హత్య జరిగిన తర్వాతి రోజు.. పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్న సమయంలోనూ ఒక వేడుకకు హాజరు కావటం.. అయినప్పటికీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవటంపై విమర్శలు వెల్లువెత్తాయి.

ఎమ్మెల్సీ అనంతబాబును ఎప్పుడు అదుపులోకి తీసుకున్నది? ఎక్కడ అదుపులోకి తీసుకున్నారు? ఆయన్ను అరెస్టు చేసిన వివరాల్ని అందించకుండా గోప్యత పాటిస్తూ.. మీడియా సమావేశం మినహా మరే వివరాల్ని బయటకు పొక్కకుండా మౌనాన్ని ప్రదర్శించటం ఏమిటన్న ప్రశ్నలు పోలిసింగ్ తీరుకు ఇబ్బందికరంగా మారిందంటున్నారు.
Tags:    

Similar News