కేసీఆర్ సంక్రాంతి పండుగ ఎక్కడ చేసుకోనున్నారు?

Update: 2021-01-13 03:51 GMT
తెలంగాణ రాష్ట్ర పాలనా కేంద్రంగా ఉన్న ప్రగతిభవన్ కంటే కూడా తనకెంతో ఇష్టమైన ఫాంహౌస్ లోనే ఎక్కువగా గడిపే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడెక్కడ ఉన్నారు. గడిచిన కొద్దిరోజులుగా ప్రగతిభవన్ లో ఉన్న ఆయన.. బిజీబిజీగా వ్యవహరించారు. పలు శాఖాధికారులతో రివ్యూ చేయటంతో పాటు.. పలు అంశాలపై నిర్ణయాల్ని తీసుకున్నారు. వరుస రివ్యూలతో కాలం గడిపిన సీఎం కేసీఆర్ మంగళవారం సాయంత్రం ఊరెళ్లిపోయినట్లుగా చెబుతున్నారు.

సంక్రాంతి పండక్కి తనకెంతో ఇష్టమైన ఫాంహౌస్ కు మంగళవారం సాయంత్రం బయలుదేరినట్లుగా తెలుస్తోంది. దీంతో.. ఈసారి సంక్రాంతి పండుగ ఫాంహౌస్ లోనే జరుపుకుంటారన్న మాట వినిపిస్తోంది. ఈ రోజు (బుధవారం) భోగి.. రేపు సంక్రాంతి.. ఎల్లుండి కనుమ నేపథ్యంలో.. పండక్కి ముందే వెళ్లిన కేసీఆర్.. పండుగ తర్వాతే ప్రగతిభవన్ కు వస్తారని చెబుతున్నారు.

పండుగ వేళ.. కుటుంబ సభ్యులతో గడపకుండా ఫాంహౌస్ కు వెళ్లటం అన్న మాటకు ఆయన సన్నిహితుల నుంచి ఆసక్తికర వ్యాఖ్యలు వస్తున్నాయి. కుటుంబం దగ్గర ఆయన ఉండటం ఏమిటి? అవసరమైతే కుటుంబమే ఆయన వద్దకు వెళ్లొచ్చు కదా? అంటున్నారు. అదీ నిజమే కదా?
Tags:    

Similar News