ఇళ్ల రాజ‌కీయం... ఎవ‌రికి ల‌బ్ధి? వైసీపీకా? టీడీపీకా?

Update: 2021-10-12 04:36 GMT
రాష్ట్రంలో తాజాగా వెలుగు చూసిన‌.. ఇళ్ల రాజ‌కీయం.. అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల‌ను కుదిపేస్తోంది. ఎన్నిక ల‌కు ముందు వైసీపీ అధినేత, ప్ర‌స్తుత సీఎం జ‌గ‌న్‌.. న‌వ‌రత్నాల్లో భాగంగా పేద‌లంద‌రికీ ఇళ్లు ఇస్తామ‌ని హామీ ఇచ్చారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న అధికారంలోకి రాగానే.. వెంట‌నే దీనిపై దృష్టి పెట్టారు. ప‌ట్ట‌ణాల్లో పేద‌ల‌కు సెంటు భూమిని, గ్రామాల్లోని వారికి సెంటున్న‌ర భూమిని ఆయ‌న కేటాయించారు. ఈ కార్య‌క్ర‌మం అనుకున్నంత వేగంగా సాగ‌లేదు. పైగా ల‌బ్ధిదారుల సంఖ్య కూడా భారీగా పెరిగింది. ఆదిలో 20 ల‌క్ష‌ల మందికి ఇళ్లు ఇవ్వాల‌ని అనుకున్నా.. త‌ర్వాత‌.. ఈ సంఖ్య ఏకంగా.. 32 ల‌క్ష‌ల‌కు పెరిగింది.

అయిన‌ప్ప‌టికీ.. ప్ర‌భుత్వం పేద‌ల‌కు ఇళ్ల స్థ‌లాల‌ను కేటాయించింది. క‌ట్టుకునేవారు క‌ట్టుకోవ‌చ్చ‌ని పేర్కొంది. లేక‌పోతే..తామే క‌ట్టిస్తామ‌ని స్ప‌ష్టం చేసింది. ఈ క్ర‌మంలో కేంద్రం నుంచి వ‌చ్చే ప్ర‌ధాన మంత్రి ఆవాస్ యోజ‌న నిధుల‌ను జోడించిపేద‌ల‌కు ల‌బ్ధి చేకూర్చేలా ఏర్పాట్లు చేశామ‌ని.. త‌ర‌చుగా ముఖ్య‌మంత్రి చెబుతున్నారు. అయితే.. దీనిపై రాజ‌కీయాలు చోటు చేసుకున్నాయి. మ‌హిళ‌ల పేరుతోనే ప‌ట్టాలు ఇవ్వ‌డంతో సాధార‌ణంగా.. ఇది సెంటిమెంటుగా మారింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌హిళ‌ల ఓట్లు వైసీపీనే ప‌డ‌తాయ‌నే విశ్లేష‌ణ‌లు కూడా వ‌చ్చాయి. దీంతో అప్ప‌టి నుంచి రాజ‌కీయ దుమారం రేగుతూనే ఉంది.

పైగా.. కేటాయించిన స్థ‌లాల‌కు సంబంధించి సేక‌రించిన భూముల విష‌యంలోనూ ప్ర‌తిప‌క్షాలు ఆరోప‌ణ లు చేశాయి. మునిగిపోయే చోట ఇచ్చార‌ని.. ఎందుకూ ప‌నికిరాని భూములు కేటాయించార‌ని.. ఇలా.. అనేక రూపాల్లో విప‌క్షాల నుంచి దాడి జ‌రిగింది. అయిన‌ప్ప‌టికీ.. ప్ర‌భుత్వం ఈ కార్య‌క్ర‌మాన్ని ముందుకు తీసుకువెళ్లింది. అయితే.. ఇప్పుడు తాజాగా హైకోర్టులో దీనిపై కేసులు దాఖ‌లు కావ‌డం.. న్యాయ‌మూర్తి.. ఈ ప‌థ‌కాన్ని త‌ప్పు ప‌ట్ట‌డం తెలిసిందే. చాలా చాల‌ని జాగా ఇస్తే.. ప్ర‌జ‌లు ఎలా ఉంటార‌ని.. మురికి కూపాలుగా కాల‌నీలు మార‌తాయ‌ని.. న్యాయ‌మూర్తి పేర్కొన్నారు. దీంతో ఈ ప‌థ‌కంపై స్టే విధించారు.

అయితే.. ఇది రాజ‌కీయంగా అధికార ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య నిప్పులు రాజేసింది. మీరు కావాల‌నే కోర్టుకు వెళ్లి .. కీల‌క ప‌థ‌కానికి అడ్డంకులు సృష్టించారంటూ.. అధికార పార్టీ వైసీపీ నేత‌లు.. ప్ర‌తిప‌క్షం టీడీపీపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. ప్ర‌జ‌లు మావైపే ఉన్నార‌ని.. అన్నారు. దీనికి కౌంట‌ర్‌గా టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. ఇళ్ల‌పై మీరే కోర్టు కు వెళ్లి ఆపించుకున్నార‌ని.. ఇళ్లు క‌ట్టేందుకు డ‌బ్బులు లేక‌.. ఇలా చేశార‌ని.. ఎదురు దాడి చేస్తున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్‌లో వైసీపీకి లాభించేది ఏంటి? అంటే.. కొన్నాళ్లు ఈ ప‌థ‌కం ఆగిపోతుంది. అంత‌కు మించి జ‌రిగేది ఏమీ లేదు. ఇక‌, చంద్ర‌బాబు చెప్పిన‌ట్టు నిజంగానే ఈ ప‌థ‌కంపై వైసీపీ నాయ‌కులే.. కోర్టుకు వెళ్లి ఉంటే.. ప్ర‌జ‌ల నుంచి ఆగ్ర‌హం వ్య‌క్తం కావ‌డం త‌థ్యం.

ఇక‌, టీడీపీ విష‌యాన్ని తీసుకుంటే.. ఆది నుంచి కూడా ఈప‌థ‌కంపై టీడీపీ నేత‌లు ఆగ్ర‌హంతోనే ఉన్నారు. భూముల విష‌యంలోనే గ‌తంలో కోర్టుల‌కు ఎక్కారు. తూర్పుగోదావ‌రి జిల్లా ఆవ భూముల విష‌యంలోనూ.. వివాదం రేపారు. ఇక‌, ఇప్పుడు కోర్టులో స్టే రావ‌డంతో అంద‌రి వేళ్లూ టీడీపీవైపు చూపుతున్నాయి. అయితే.. దీనిలో త‌మ పాత్ర లేద‌ని అంటున్నా.. ఇత‌మిత్థంగా.. దీనికి సంబంధించిన ఆధారాల‌ను మాత్రం చంద్ర‌బాబు బ‌య‌ట పెట్ట‌లేదు. సో.. ఈ విష‌యం.. మున్ముందు సీరియ‌స్ కావ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. రాజ‌కీయ ల‌బ్ధి కోసం.. టీడీపీనే ఈ ప‌థ‌కంపై అడ్డంకులు సృష్టిస్తోంద‌ని క‌నుక ప్ర‌జ‌ల్లోకి వెళ్తే.. మొత్తానికే మోసం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుంందో చూడాలి.




Tags:    

Similar News