గ్రౌండ్ రిపోర్ట్: 'మల్కాజ్‌ గిరి'పై నిలిచేదెవరో...?

Update: 2019-04-10 02:30 GMT
పార్లమెంట్ నియోజకవర్గం: మల్కాజ్ గిరి
టీఆర్‌ ఎస్‌: మర్రి రాజశేఖర్‌ రెడ్డి
కాంగ్రెస్‌: రేవంత్‌ రెడ్డి
బీజేపీ: ఎన్‌.రాంచంద్రారావు

దేశంలోనే అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గాల్లో మల్కాజ్ గిరి ఒకటి. ఇక్కడ అపారంగా ఉన్న జనాభాతో గెలవడం అందరికీ కష్టంగా ఉంటుంది. ప్రతీసారి మల్కాజ్‌ గిరిలో ఓటర్లు విలక్షణ తీర్పునిస్తున్నారు. ఆంధ్ర సెటిలర్లు గెలుపును ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు.  నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఏ పార్టీ రెండోసారి గెలవలేదు. టీఆర్‌ఎస్‌ హవా సాగిన గత ఎన్నికల్లో టీడీపీ నుంచి  మల్లారెడ్డి గెలుపొందారు. ఈసారి ఎన్నికల్లో ఆయన టీఆర్‌ ఎస్‌ లో చేరి అసెంబ్లీ అభ్యర్థిగా గెలుపొంది మంత్రి పదవిని కూడా దక్కించుకున్నారు. దీంతో మల్కాజ్ గిరి ఎంపీ స్థానం నుంచి టీఆర్‌ ఎస్‌ అభ్యర్థిగా ఆయన అల్లుడు మర్రిరాజశేఖర్‌ రెడ్డి బరిలో ఉన్నారు. ఇక కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉద్దండుడైన రేవంత్‌ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ లో ఓడిపోయారు. అయినా మల్కాజ్‌ గిరి టికెట్‌ ను పార్టీ కట్టబెట్టింది. ఆయన గెలుపుపై ధీమా ఉన్నట్లేనని తెలుస్తోంది. ఇక బీజేపీ నుంచి ఎమ్మెల్సీగా ఉన్న ఎన్‌.రామచంద్రారావు ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఇలా గట్టిపోటీ మధ్య సాగుతున్న మల్కాజ్‌ గిరిని ఎవరు ఏలుతారో చూడాలి.

* మల్కాజ్‌ గిరి లోక్‌ సభ నియోజకవర్గం చరిత్ర:
అసెంబ్లీ స్థానాలు: మేడ్జల్‌, మల్కాజ్‌ గిరి, కుత్భుల్లాపూర్‌, కూకట్‌ పల్లి, ఉప్పల్‌, ఎల్‌.బి.నగర్‌. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌
ఓటర్లు: 30 లక్షల 90 వేలు

*నియోజకవర్గ చరిత్ర:
2009లో నియోజకవర్గం అవతరించింది. ఇప్పటి వరకు రెండు సార్లు ఎన్నికలు జరిగాయి. 2009లో కాంగ్రెస్‌, 2014లో టీడీపీ కైవసం చేసుకుంది. ఇక్కడ అన్ని మతాల వారితో పాటు కార్మికులు ఎక్కువగానే ఉంటారు. దీంతో ప్రతీసారి ఇక్కడ గెలుపు కోసం అభ్యర్థులు తీవ్రంగా కష్టపడుతుంటారు.

* టీఆర్‌ ఎస్‌ నుంచి మంత్రి మల్లారెడ్డి అల్లుడు
గత ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందిన మల్లారెడ్డి డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ ఎస్‌ తరుపున మేడ్చల్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. ఆ తరువాత ఆయనకు కేసీఆర్‌ మంత్రి పదవి  కూడా కట్టబెట్టారు. దీంతో ఈ నియోజకవర్గంలో ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్‌ రెడ్డిని బరిలో దించారు. ఎంపీగా మల్లారెడ్డి చేసిన అబివృద్ధి పనులు, ఆయనకున్న రాజకీయ అనుభవంతో ఆయన అల్లుడు గెలుపుకోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. రాజశేఖర్‌ రెడ్డి రాజకీయాలకు కొత్తే అయినా బలమైన అధికార టీఆర్‌ ఎస్‌ అండదండలు ఎక్కువగా ఉండడంతో ఆయన గెలుపుపై దీమా వ్యక్తం చేస్తున్నారు.

* అనుకూలతలు:
-టీఆర్‌ ఎస్‌ కు స్థానికంగా బలమైన కేడర్‌
-మాజీ ఎంపీ మల్లారెడ్డి చేసిన అభివృద్ధి పనులు
-టీఆర్‌ ఎస్‌ చేపట్టిన సంక్షేమ పథకాలు

* ప్రతికూలతలు:
-రాజకీయాల్లోకి కొత్త
-సొంతంగా ఇమేజ్‌ లేకపోవడంఓ

* ఎమ్మెల్యే నుంచి ఎంపీ బరిలోకి బలమైన రేవంత్‌ రెడ్డి..
 కాంగ్రెస్‌ పార్టీలో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గా కొనసాగుతున్న రేవంత్‌ రెడ్డి మల్కాజ్ గిరి  స్థానం నుంచి ఎంపీగా బరిలో ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పేరు సంపాదించిన ఆయన గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో కొన్ని రోజులు కనుమరుగయ్యారు. ఆ తరువాత కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ కోరిక మేరకు ఎంపీ టికెట్‌ ఇవ్వడంతో మల్కాజ్ గిరిలో వ్యూహాత్మకంగా  ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు. అయితే కాంగ్రెస్‌ కు బలమైన క్యాడర్‌ లేకపోవడం ఆయనకు మైనస్‌ గా మారింది. కాకపోతే వ్యక్తిగత ఇమేజ్‌ తన గెలుపుకు సహకరిస్తుందని భావిస్తున్నారు.

* అనుకూలతలు:
-కాంగ్రెస్‌ లో సీనియర్‌ నాయకుడు
-సమస్యలపై పోరాడుతానన్న విశ్వాసం
-పార్టీ అండదండలు పుష్కలంగా ఉండడం

* ప్రతికూలతలు:
-కాంగ్రెస్‌ నుంచి వలసలతో నిరాశ
-కేడర్‌ లేకపోవడం

*టఫ్ ఫైట్ లో గెలుపెవరిది?
మల్కాజ్‌ గిరి లోక్‌ సభ నియోజకవర్గంలో విద్యావంతులు కూడా ఎక్కువే ఉండడంతో బీజేపీ ఇమేజ్‌ తనను గెలిపిస్తుందని ఎన్‌.రామచంద్రారావు బరిలో ఉన్నారు. అయితే అధికార టీఆర్ ఎస్ పార్టీ ఈ పార్లమెంట్ పరిధిలో మెజార్టీ సీట్లు సాధించింది. పైగా కేసీఆర్ సంక్షేమ పథకాలు పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల వాన కురిపించాయి.దీంతో టీఆర్ ఎస్ ధీమాగా ఉంది. ఇక పడిలేచిన కెరటంలా రేవంత్ రెడ్డి విస్తృత ప్రచారంతో టీఆర్ ఎస్ ను షేక్ చేస్తున్నారు. టెక్నాలజీని ఉపయోగించి.. జనాలకు చేరువ అవుతూ దూసుకుపోతున్నారు. ఈ నియోజకవర్గంలో ప్రధానంగా  టీఆర్‌ ఎస్‌ కాంగ్రెస్‌ ల మధ్యే పోరు ఉంటోంది. రేవంత్ ఈసారైనా గెలుస్తాడా అన్న ఉత్కంఠ పొలిటికల్ వర్గాల్లో నెలకొంది.

    
    
    

Tags:    

Similar News