కృష్ణాజిల్లా నేతలు ఎందుకు యాక్టివ్ గా ఉండటంలేదు ?

Update: 2022-09-08 17:30 GMT
చంద్రబాబునాయుడు కృష్ణాజిల్లా నేతలకు ఫుల్లుగా క్లాసు పీకారు. విజయవాడలో సీనియర్ నేత, మాజీ కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీపై వైసీపీ నేతలు దాడిచేసి తీవ్రంగా గాయపరిచిన విషయం తెలిసిందే. ఈ ఘటనపైనే నేతలకు క్లాసుపీకారు. ఎందుకంటే జిల్లాల్లోని నేతలు ఎవరు కూడా గాంధీకి మద్దతుగా నిలబడలేదు కాబట్టే. ఘటన జరిగిన ప్రాంతానికి వెళ్ళటంకానీ, వైసీపీ నేతలు చర్యలను ఖండించటంకానీ చేయలేదు. గాంధిపై జరిగిన దాడితో తమకేమీ సంబంధంలేదన్నట్లే వ్యవహరించారు.

ఈ విషయంపైనే బుధవారం సాయంత్రం సమీక్షించారు. నేతల తీరుపై బాగా ఫైర్ అయ్యారు. ఇక్కడ అర్ధంకాని విషయం ఏమిటంటే రాష్ట్రంలో ఎక్కడ గొడవలు జరుగుతున్నా చంద్రబాబు రెస్పాండ్ అవుతున్నారే కానీ ఆయా ప్రాంతాల్లోని చాలామందినేతలు పెద్దగా స్పందించటంలేదు. నేతల్లోని ఇలాంటి వైఖరికి కారణాలు ఏమిటో అర్ధం కావటంలేదు. ఒకవైపు ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్నాయి. మరోవైపు టికెట్ల తమకే కావాలంటే తమకే ఇవ్వాలని చాలామంది నేతలు పోటీలు పడుతున్నారు.

ఎన్నికల్లో పోటీకి ఆతృతపడుతున్న సీనియర్ నేతలు మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేయటంలో మాత్రం ఎందుకు వెనకాడుతున్నట్లు ? ఇదే విషయం చంద్రబాబుకు కూడా అర్ధంకావటంలేదు. ఈ విషయాన్నే నేతలతో జరిగిన సమీక్షలు అందరినీ నిలదీసి అడిగారు.

అయినా నేతలెవరు సరైన సమాధానాలు చెప్పలేదు. ప్రతిపక్షమంటే ప్రతి విషయంలోను ప్రభుత్వాన్ని వ్యతిరేకించాల్సిన అవసరంలేదు. అయితే ప్రభుత్వంలో జరుగుతున్న తప్పొప్పులను ఎండగట్టడం, ప్రతిపక్ష నేతలపై జరుగుతున్న అధికారపార్టీ నేతల దాడులపై నిరసన తెలపటం ప్రతిపక్షాల బాధ్యతన్న విషయాన్ని చాలామంది తమ్ముళ్ళు మరచిపోయినట్లున్నారు.

ఇంతచిన్న బాధ్యతను కూడా నేతలకు చంద్రబాబే గుర్తుచేయాల్సి రావటం ఆశ్చర్యంగా ఉంది. నేతల్లో చాలామంది జూమ్ మీటింగులకు, జూమ్ ద్వారా మీడియా సమావేశాలకు అలవాటుపడిపోయారు. క్షేత్రస్ధాయిలో పర్యటించాలని, రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేయాలంటే చాలామంది వెనకాడుతున్నారు. దీన్నే చంద్రబాబు ఎత్తిచూపారు. ఇకనుండి స్వయంగా తానే జిల్లా వ్యవహారాలను పర్యవేక్షించాలని డిసైడ్ అయ్యారు. మరిప్పటికైనా నేతల్లో మార్పొస్తుందా ?

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News