`కొత్త‌ప‌లుకు` రాధా కృష్ణ‌కు పొగ‌పెడుతున్నారా?

Update: 2019-07-09 14:30 GMT
అధికార పార్టీ అండ‌తో.. ప్ర‌జాస్వామ్య నాలుగో స్తంభం(ఫోర్త్ ఎస్టేట్)గా పేరు పెట్టుకుని విప‌క్ష నాయ‌కుల‌పై వార్త‌లు వండి వార్చిన ద‌మ్మున్న ప‌త్రిక ఆంధ్ర‌జ్యోతికి ప్ర‌స్తుత అధికార పార్టీ పొగ‌పెడుతోందా?  సీఎం జ‌గ‌న్‌.. కొత్త‌ప‌లుకు రాధాకృష్ణ‌కు చుక్క‌లు చూపించాల‌ని నిర్ణ‌యించుకున్నారా? అంటే.. గ‌త కొన్నాళ్లుగా అనుస‌రిస్తున్న విధానాలు, జ‌గ‌న్ ప్ర‌భుత్వం తీసుకుంటున్న నిర్ణ‌యాలు అందుకు ఔన‌నే అంటున్నాయి. పాద‌యాత్ర చేస్తున్న స‌మ‌యంలోను, దీనికి ముందు జ‌గ‌న్ ప‌త్రిక‌ను స్తాపించిన ద‌గ్గ‌ర నుంచి కూడా ఆంధ్ర‌జ్యోతి మీడియాతో వ్య‌క్తిగ‌త వైరమే ఉంది. జ‌గ‌న్ మీడియాపై క‌థ‌నాలు వండివార్చిన నేప‌థ్యం నుంచి నేటి వ‌ర‌కు ఈ వైరం కొన‌సాగుతూనే ఉంది.

ఈ నేప‌థ్యంలోనే నేరుగా తాము నిర్వ‌హించే ప్రెస్ మీట్‌ ల‌కు మీరు రావాల్సిన అవ‌స‌రం లేద‌ని జ‌గ‌న్ రెండేళ్ల కింద‌టే ఆంధ్ర‌జ్యోతి సంస్థ‌ల‌కు చెప్పారు. మిమ్మ‌ల్ని మేం పిల‌వం, మా వార్త‌లు మీరు రాయొద్దు! అని ఆయ‌న ఖ‌రాకండిగా చెప్పా రు. ఈ నేప‌థ్యంలోనే అప్ప‌టి కొత్త‌ప‌లుకులో ఏబీఎన్ ఎండీ రాధా కృష్ణ‌.. ``దేబిరించేది లేదు!!``-అంటూ పెద్ద ఎత్తున కాలమ్ రాసి జ‌గ‌న్‌ కు కౌంట‌ర్ ఇచ్చారు. అయితే, ఎంతైనా మీడియా.. అన్ని వ‌ర్గాల‌ను సంతృప్తి ప‌ర‌చాలి కాబ‌ట్టి ఏదో ఒక రూపంలో వార్త‌లు సేక‌రించి నేటికీ జ‌గ‌న్ వార్త‌ల‌ను, ప్ర‌భుత్వ వార్త‌ల‌ను ప్ర‌చురిస్తున్నారు. పాద‌యాత్ర స‌మ‌యం లోను క‌వ‌ర్ చేశారు.

అయితే, జ‌గ‌న్‌ లో మాత్రం త‌న‌పై చేసిన యాంటీ ప్ర‌చారం తాలూకు ముద్ర పోలేదు. ఆంధ్ర‌జ్యోతి స‌హా ఏబీఎన్‌ పై క‌సి మాత్రం కొన‌సాగుతూనే ఉంది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న నేరుగా ప‌లు సంద‌ర్భాల్లో ఆంధ్రజ్యోతి స‌హా ఎల్లో మీడియాను చ‌ద‌వొద్దు.. చూడొద్దు.. అంటూ పిలుపు కూడా ఇచ్చారు. తాజాగా త‌న ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో ఘ‌నంగా రైతు భ‌రోసా కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు. దివంగ‌త వైఎస్ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని నిర్వ‌హించిన ఈ కార్య‌క్ర‌మానికి సంబంధించి భారీ ఎత్తున తొలిసారి ప్ర‌క‌ట‌న‌లు గుప్పించారు. అయితే, ఒక్కఆంధ్ర‌జ్యోతిని మిన‌హాయించి .. అన్ని మీడియా సంస్థ‌ల‌కు ఈ ప్ర‌క‌ట‌న ఇవ్వ‌డం, ఆంధ్ర‌జ్యోతిని ప‌క్క‌న పెట్ట‌డం చ‌ర్చ‌కు దారితీస్తోంది.

మొత్తంగా ఈ వ్య‌వ‌హారం చాలా నిశితంగా ఆలోచించి జ‌గ‌న్ ప్ర‌భుత్వం చేసింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి, నిబంధ‌న ల‌కు అనుగుణంగా త‌మ‌కు కూడా ఇవ్వాల‌ని ఆంధ్ర‌జ్యోతి కోర్టుకు వెళితే.. గ‌తంలో ఈ ప‌త్రిక రాసిన క‌థ‌నాలు, త‌న‌పై చూపిన వివ‌క్ష వంటివి స‌హా.. గ‌త ప్ర‌బుత్వంలో నిబంధ‌న‌ల‌ను ప‌క్క‌న పెట్టి దోచుకున్న విధానంపై కూడా కోర్టు ద్వారా నే అక్షింతలు వేయించాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది. మ‌రి దీనిపై రాధాకృష్ణ ఎలా స్పందిస్తారో చూడాలి.
 
   
   
   

Tags:    

Similar News