పవన్‌ విషయంలో బీజేపీ ప్రయత్నాలు ఫలిస్తాయా?

Update: 2023-01-10 07:11 GMT
ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే ఎన్నికల పొత్తులు సర్వత్రా ఆసక్తి రేపుతున్నాయి. వైసీపీ దాదాపు ఒంటరి పోరాటానికి సిద్ధమవుతోంది. మరోవైపు జనసేన-బీజేపీ పొత్తులో ఉన్నాయి. ఇంకోవైపు టీడీపీ పవన్‌ కల్యాణ్‌ పై ఆశలు పెట్టుకుంది. పవన్‌ ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లో చీలనివ్వనని పదే పదే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జనసేన-టీడీపీ పొత్తు ఖాయమని భావిస్తున్నారు. విశాఖలో పవన్‌ పర్యటనను పోలీసులు అడ్డుకోవడంపై పవన్‌ ను చంద్రబాబు పరామర్శించారు. అలాగే కుప్పంలో చంద్రబాబును పోలీసులు అడ్డుకోవడంపై ఆయనను కొద్ది రోజుల క్రితం పవన్‌ ఆయనను కలిసి సంఘీభావం తెలిపిన సంగతి తెలిసిందే.

ఈ కలయికపై బీజేపీ అంతర్మథనం చెందుతోంది. టీడీపీ, వైసీపీ అవినీతి పార్టీలని, కుటుంబ పార్టీలని బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. బీజేపీతో ఉంటేనే ఏపీలో కాపుల సీఎం కల సాకారమవుతుందని చెబుతున్నారు. బీజేపీతోనే కాపులకు రాజ్యాధికారం దక్కుతుందని బీజేపీ నేతలు అంటున్నారు. పవన్‌ కల్యాణ్‌ బీజేపీతోనే కొనసాగాలని కోరుతున్నారు.

వైసీపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని.. అలాగని ప్రజలు టీడీపీకి ఓటేయబోరని బీజేపీ నేతల ఉద్దేశంగా ఉంది. బీజేపీ–జనసేన ప్రత్యామ్నాయాన్ని ప్రజలు కోరుకుంటారని చెబుతున్నారు. ఇందుకు పంజాబ్‌ ను ఉదాహరణగా చూపుతున్నారు. పంజాబ్‌ లో అకాలీదళ్‌ ను కాదని, కాంగ్రెస్‌ కాదని కొత్త ప్రత్యామ్నాయం ఆమ్‌ ఆద్మీ పార్టీని గెలిపించారని గుర్తు చేస్తున్నారు,

ఈ నేపథ్యంలో ఏపీలో సైతం వచ్చే ఎన్నికల్లో ప్రజలు టీడీపీని, వైసీపీకి ఓటు వేయబోరని చెబుతున్నారు. పంజాబ్‌ లో మాదిరిగానే జనసేన - బీజేపీని ప్రత్యామ్నాయంగా ఎంచుకుంటారని అంటున్నారు.

పవన్‌ కల్యాణ్‌-చంద్రబాబు భేటీపై బీజేపీ నేతల్లో అసంతృప్తి వ్యక్తం అవుతున్నా ఎన్నికల నాటికి పవన్‌ తమతోనే కొనసాగుతారని బీజేపీ నేతలు భావిస్తున్నారు. మరోవైపు బీజేపీకి రాష్ట్రంలో ఓటు బ్యాంక్‌ కనీసం ఒక్క శాతం కూడా లేదు. బీజేపీతో కలిసి వెళ్తే తన వల్ల ఆ పార్టీకి ప్రయోజనం చేకూరుతుందని పవన్‌ భావిస్తున్నారు. 2014 లో పోటీ చేసినట్టు టీడీపీ, జనసేన, బీజేపీ కలసి పోటీ చేయాలనేది పవన్‌ ఉద్దేశంగా ఉందని అంటున్నారు.

చంద్రబాబు సైతం బీజేపీ తమతో కలసి రావాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఆ పార్టీ నుంచి సానుకూల సంకేతాలు రాకున్నా ఎన్నికల నాటికి తమతో కలసి రావచ్చని భావిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News