ట్రబుల్ షూట‌ర్ ను తెర మీద‌కు తేవాల్సిందే

Update: 2019-05-24 07:52 GMT
కొన్ని ఆట‌ల్లో దూకుడు అవ‌స‌రం. అలా అని.. అన‌వ‌స‌ర‌మైన దూకుడు ఎదురుదెబ్బ‌ల‌కు కార‌ణ‌మ‌వుతుంది. త‌న కొడుకు రాజ‌కీయ భ‌విష్య‌త్తును సెట్ చేసేందుకు వీలుగా గ్రౌండ్ సిద్ధం చేస్తున్న కేసీఆర్‌.. అందుకు అడ్డు వ‌స్తాడ‌న్న ఆలోచ‌న‌తో మేన‌ల్లుడు హ‌రీశ్ ను ప‌క్క‌న పెట్టేసిన వైనం తెలిసిందే.

దీనిపై హ‌రీశ్ తో పాటు.. ఆయ‌న్ను అభిమానించే ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులు మొద‌లు కోట్లాది మంది టీఆర్ ఎస్ అభిమానుల్లో మ‌న‌సుల్లో బాధ ఉంది. అలా అని గులాబీ బాస్ నిర్ణ‌యాన్ని ప్ర‌శ్నించే ధైర్యం లేదు. దీంతో..టైం కోసం ఎదురుచూస్తుండిపోయారు. ఇలాంటివేళ‌.. జ‌రిగిన లోక్ స‌భ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో టీఆర్ ఎస్ కు షాక్ త‌గ‌ల‌టం తెలిసిందే. మొత్తం 17 స్థానాల్లో 16 స్థానాల్లో టీఆర్ ఎస్ గెలుపు ఖాయ‌మ‌ని.. కౌంటింగ్ ఫ‌లితాలు వెలువ‌డ‌టానికి ఒక రోజు ముందు.. సంబ‌రాల‌కు సిద్ధం చేయాలంటూ కేసీఆరే స్వ‌యంగా ప్ర‌క‌టించారు.

తీరా చూస్తే.. కేసీఆర్ కుమార్తె క‌విత దారుణ ప‌రాజ‌యం గులాబీ వ‌ర్గాల్లో గెలుపు సంతోషాన్ని లేకుండా చేశాయి. క‌విత ఓట‌మి ఒక షాక్ అయితే.. త‌మ‌కు అడ్డా లాంటి కరీంన‌గ‌ర్ ఎంపీ స్థానంలోనూ ఓట‌మిపాలు కావ‌టం వారికి మింగుడుప‌డ‌ని రీతిలో మారింది. ఓప‌క్క త‌న కుమార్తెను గెలిపించుకోలేక‌పోవ‌టం ఒక వైఫ‌ల్యం కాగా.. తమ సొంత జిల్లా అయితే క‌రీంన‌గ‌ర్ లో పార్టీ ఓట‌మికి ఆయ‌న స‌మాధానం చెప్ప‌లేని ప‌రిస్థితి.

ఇదిలా ఉంటే.. హ‌రీశ్ ప‌ర్య‌వేక్షించిన మెద‌క్ ఎంపీ స్థానంలో పార్టీ విజ‌యం సాధించ‌ట‌మే కాదు.. ఏకంగా రెండున్న‌ర ల‌క్ష‌ల మెజార్టీ రావ‌టంతో గెలుపు క్రెడిట్ మొత్తం హ‌రీశ్ ఖాతాలోకి వెళ్లిన పరిస్థితి. ఇలాంటివేళ‌.. ఇప్ప‌టివ‌ర‌కూ ప‌క్క‌న పెట్టిన టాస్క్ మాస్ట‌ర్ కు పార్టీలోనూ.. ప్రభుత్వంలోనూ ప్రాధాన్య‌త ఇవ్వాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డిన‌ట్లే. తాజా వైఫ‌ల్యం నేప‌థ్యంలో కేసీఆర్ త‌న ఫ్యూచ‌ర్ ప్లాన్ ను మ‌రోసారి చెక్ చేసుకొని.. మార్పులుచేర్పులు చేసుకోవాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డిన‌ట్లేన‌ని చెప్ప‌క‌తప్ప‌దు.
Tags:    

Similar News