కేసీఆర్ తప్పుకొని 25న కేటీఆర్ బాధ్యతలు చేపడుతారా?

Update: 2021-10-13 10:37 GMT
తెలంగాణలో టీఆర్ఎస్ లో అధికార మార్పిడిపై జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. ఈనెల 25న పార్టీ అధ్యక్ష ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. 25న జరగబోయే పార్టీ జనరల్ బాడీ మీటింగ్ లో అధ్యక్షుడిని ఎన్నుకుంటామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తెలిపారు. చాలా కాలంగా పార్టీ శ్రేణులు ఆశిస్తున్నట్టు కేటీఆర్ కు ఈసారి పూర్తి స్థాయిలో పార్టీ పగ్గాలు అప్పగింత ఉంటుందా? కేసీఆర్ తప్పుకుంటారా? అన్న చర్చ సాగుతోంది.

తెలంగాణలో వరుసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ లో కేసీఆర్ తర్వాత కేటీఆర్ సీఎంగా ఫోకస్ అయ్యారు. ప్రతి ఎన్నిక గెలుచుకొచ్చాక ఇదే మాట వినపడేది. ఈనెల 25న పార్టీ అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందని.. 17న షెడ్యూల్ విడుదల చేస్తామని కేటీఆర్ ప్రకటించడంతో మళ్లీ చర్చ మొదలైంది.

ఇప్పటికే గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో కమిటీల నిర్మాణం పూర్తయిన దరిమిలా.. ఈనెల 25న జనరల్ బాడీ మీటింగ్ పెట్టి అదే రోజున పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకుంటామని మంత్రి తెలిపారు.

2017లో జరిగిన పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఏకగ్రీవంగా అధ్యక్షుడయ్యారు. 2019లో ఎన్నికలు జరగాల్సి ఉండగా.. సార్వత్రిక ఎన్నికలతో ప్రక్రియ వాయిదా పడింది. 2020,2021లో కరోనా కారణంగా టీఆర్ఎస్ అధ్యక్ష ఎన్నికలు సాగలేదు.

ఇప్పుడు కరోనా తీవ్రత తగ్గడం.. తెలంగాణలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతున్న నేపథ్యంలో అధ్యక్ష ఎన్నికకు సిద్ధమైనట్లు కేటీఆర్ తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ సంస్థాగత నిర్మాణ ప్రక్రియ పూర్తయ్యిందని ఇప్పుడు అధ్యక్షుడి ఎంపికే తరువాయి అని అంటున్నారు.

అక్టోబర్ 25న టీఆర్ఎస్ జనరల్ బాడీ మీటింగ్ ను హైదరాబాద్ హెచ్ఐఐసీ ప్రాంగణంలో ఎన్నుకుంటున్నారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన 14వేల మంది ప్రజాప్రతినిధులు పాల్గొంటున్నారు. 25న అధ్యక్ష ఎన్నిక ముగిశాక పార్టీ ప్లీనరీ ఉంటుంది.

ఐదేళ్ల తర్వాత జరిగే ఈ అధ్యక్ష ఎన్నికల్లో సంచలన నిర్ణయాలు ఉండొచ్చని.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ కు పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించబోతున్నారని ప్రచారం సాగుతోంది. భవిష్యత్ అవసరాల దృష్ట్యా కేటీఆర్ ను ప్రమోట్ చేయబోతున్నారని అంటున్నారు. మరి 25న ఈ విషయంపై ఏం జరుగుతుందనేది తేలనుంది.




Tags:    

Similar News